Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు ఉదయం ఆయన ఇంటికి వెళ్లడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రిలో ఆటవిక రాజ్యం నడుస్తోంది అని ఆరోపించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.. కానీ, హైకోర్టు ఆదేశాలు వచ్చి రెండు మాసాలైనా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదని మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.
Read Also: Vijay Devarakonda : 6 నెలలు చాలా టెన్షన్ పడ్డాను.. కానీ అదో తృప్తి
అయితే, ఈ రోజు ఉదయం తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. పోలీసులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించటం లేదు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొద్దని ఏవైనా ఆదేశాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేని తాడిపత్రి పట్టణంలోకి అనుమతించకపోవడం ఏం న్యాయం? అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం.. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తామని అనంత వెంకటరామిరెడ్డి తేల్చి చెప్పారు.