ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపై చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. కల్తీసారా మరణాలపై చర్చకు పట్టుబడితే నిన్న 5గురు, ఇవాళ 11మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారన్నారు. అసెంబ్లీలో నిన్న ముఖ్యమంత్రి ప్రకటన వ్యక్తిగతమని మండలిలో బొత్స ప్రకటించారని, సభలో ముఖ్యమంత్రి తప్పుడు ప్రకటనలు ఎలా చేస్తారు అని ఆయన ప్రశ్నించారు.
నియంత పరిపాలన సభలో తలపిస్తోందని ఆయన మండిపడ్డారు. అంనతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా జరుగుతున్న నాటుసారా స్కామ్ లో ఎందరో పేదలు బలవుతున్నారని, తమ అవినీతి బయటపడుతుందనే సభలో కాల్తీ సారా అంశం చర్చకు రాకుండా చూస్తున్నారన్నారు. ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. రాచరికపు పాలనను వైసీపీ తలపిస్తోందని, అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహించటం దుర్మార్గమన్నారు. ప్రతిపక్ష వాదన బయటకు రాకుండా చేస్తున్నారని, పోడియం వద్ద మార్షల్స్ తో మాపై దాడి చేయించారని ఆయన ఆరోపించారు.