Ambati Rambabu Counters On Pawan Kalyan Comments: తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ అసలు సిసలు రూపం ఈరోజు బయటపడిందని అన్నారు. తాము ఆది నుంచి పవన్‌ను ప్యాకేజీ స్టార్ అని చెప్తున్నామని, ఇప్పుడు కూడా అదే మాట చెప్తామని పేర్కొన్నారు. పవన్ ముమ్మాటికీ ఒక ప్యాకేజీ స్టారేనని చెప్పారు. పవన్ ప్యాకేజీ స్టార్ అని ఒకసారి కాదు.. వందసార్లు చెప్తానని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వనని చెప్పిన పవన్.. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్న తర్వాతే ఈ మాట మాట్లాడారని ఆరోపించారు. ఈ విషయం సామాన్య ప్రజలకి కూడా అర్థమైందన్నారు.
ఏ రాజకీయ నాయకుడైనా తాను పదవిలోకి రావాలని కోరుకుంటారని, కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తానని చెప్పే నేతను పవన్‌ను మాత్రమే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో పవన్ ప్యాకేజీ స్టార్ అని తేలిపోయిందన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి కాదని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకొని.. పవన్ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కి లేదన్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని హింసించినప్పుడు నువ్వెందుకు స్పందించలేదు? అంటూ పవన్‌కి సూటి ప్రశ్న సంధించారు. కుక్క తోక పట్టుకొని గోదారి ఈదకండని జనసైనికుల్ని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు పవన్ కళ్యాణ్‌కు చెప్పుతో కొడతారని కౌంటర్ వేశారు.
అంతకుముందు కూడా అంబటి రాంబాబు ట్విటర్‌లో పవన్‌పై విరుచుకుపడ్డారు. ‘‘చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి వైసీపీని దించుతానంటావు కానీ.. నేనే గద్దెనెక్కుతాననలేవు! నువ్వు ఒక నాయకుడివి? నీదొక రాజకీయ పార్టీనా?’’ అంటూ ట్వీట్లు చేశారు. ‘నీ ప్యాకేజ్ ఊపులకి ఉడతలు కూడా జడవవు’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే.. చంద్రబాబుకు పవన్ బానిసగా పనిచేస్తున్నారని, ఆయనది జనసేన పార్టీ కాదు బాబుసేన అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు వాణి వినిపించేందుకే పవన్ విశాఖ వచ్చారని.. హింసను ప్రోత్సాహించిన ఏ పార్టీ కూడా బాగుపడలేదని అంబటి రాంబాబు వెల్లడించారు.