ఏపీలో మూడురాజధానుల రచ్చ కొనసాగుతూనే వుంది. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఖండిస్తున్నాం అన్నారు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత శివారెడ్డి, మూడు రాజధానుల పేరుతో మళ్లీ ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికలలో హామీ ఇచ్చారు. తరువాత మాట తప్పి మూడు రాజధానుల పేరుతో మాట తప్పారు.
మహిళలు, రైతులు 800రోజులకు పైగా ఉద్యమం చేశారు. మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుని.. మళ్లీ వివాదం చేయడం సమంజసమా..? అమరావతిని అభివృద్ధి చేసి ఫ్లాట్లు ఇస్తే.. ఆప్రాంతానికి అందరూ వస్తారు. అమరావతి అభివృద్ధికి లక్షల కోట్లు కావాలని చెప్పడం సరి కాదు. విభజన చట్టం ప్రకారం ఎప్పుడో అమరావతి రాజధాని అయ్యింది. ప్రభుత్వాలు మారితే రాజధాని మార్చుకుంటూ పోతారా..?
అన్ని పార్టీలు రాజధానిగా అమరావతే ఉండాలని సమర్ధించాయి. మూడేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా వెనుక బడేలా చేశారు. ఎక్కడా ఒక్క పరిశ్రమ, కట్టడాలు రాకుండా చేశారు. ప్రజలు కూడా సీఎం చేసే మోసాలను గుర్తించి బుద్ది చెప్పాలి. రాజధాని అమరావతిని సాధించుకునేందుకు పోరాటాన్ని కొనసాగిస్తాం. సీఎం జగన్ తీరు మార్చుకుని, మనసు మార్చుకోవాలి. న్యాయ స్థానాలు న్యాయబద్దంగా తీర్పు ఇచ్చినా తప్పుబడతారా..? అమరావతి అభివృద్ధి కోసం మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం అన్నారు శివారెడ్డి.