YSRCP: ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల స్కూల్లో హెపటైటిస్- ఏ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అరకు ఎంపీ తనూజా రాణి నేతృత్వంలో వైసీపీ ప్రతినిధుల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఎన్‌హెచ్చార్సీ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించాలని కోరగా.. కమిషన్ చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు మీడియాకు వెల్లడించింది వైసీపీ ప్రతినిధి బృందం.. ఎంపీ తనూజ రాణి ఆధ్వర్యంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుభద్ర, ఇచ్ఛాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతీ దివ్య, మన్యం-పార్వతీపురం జిల్లా వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు తదితరులు మానవ హక్కుల సంఘం చైర్మన్‌ని కలిసిన వైసీపీ ప్రతినిధి బృందంలో ఉన్నారు..
Read Also: Hamas Hostages 2025: ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.. హమాస్ చెర నుంచి విడుదలైన బందీలు
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, గురుకుల పాఠశాలతోపాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారని, ఈ ఘటన జరిగి వారం రోజులవుతున్నా ప్రభుత్వంలో కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తాగునీరు కలుషితమై కురుపాం- పార్వతీపురం గురుకుల పాఠశాలలో చదివే 170 మంది గిరిజన విద్యార్థులు హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ కి గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స తీసుకున్నారు. అందులో ఇద్దరు విద్యార్థులు చనిపోవడం కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని పాఠశాలల్లో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇద్దరు గిరిజన విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా ఉండటం లేదు. చనిపోయిన ఇద్దరు పిల్లలకు పోస్ట్‌మార్టం కూడా నిర్వహించలేదని మండిపడ్డారు అరకు ఎంపీ తనూజారాణి.. ఇక, కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు పుష్పశ్రీవాణి.. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన వైఎస్ జగన్ మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేసి వెళ్లారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి అండగా నిలబడాలని పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు.