YS Jagan: ఏపీలో ఇప్పుడు మిర్చి రైతుల కష్టాలపై రాజకీయ దుమారం రేగుతోంది.. ఓవైపు వైసీపీ ఆరోపణలు.. మరోవైపు.. కూటమి ప్రభుత్వం కౌంటర్ ఎటాక్.. ఇంకా.. మిర్చి రైతులను ఆదుకోవడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు ఇలా.. మొత్తం ఇప్పుడు మిర్చి మద్దతు ధర చుట్టే చర్చ సాగుతోంది.. ఇప్పటికే గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్లి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా వేదికగా.. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు..
* చంద్రబాబు తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి ఉంది. కొనేవాడులేక రూ.10వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1,50,000 పైమాటే. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ, మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్టుగా యథావిధిగా కలరింగ్ ఇస్తున్నారు అని విమర్శించారు జగన్.
* తూతూ మంత్రంగా మళ్లీ రైతులను మోసం చేసి, ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖరాయడం ఏంటి? కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖరాయడం ఏంటి? మీరు బాధ్యతను వేరేవాళ్లమీద నెట్టడం ఏంటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటిసాకులు వెతుక్కోవడం ఏంటి? ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
* మేం 2021లో అంటే 5ఏళ్ల కిందట, పెట్టుబడి ఖర్చులు ఎకరాకు రూ.1లక్ష ఉన్నప్పుడు, సాధారణంగా అప్పుడు దిగుబడి ఎకరాకు 20 క్వింటాళ్లుపైన ఉన్నప్పుడు అప్పట్లోనే 5 ఏళ్ల కిందట ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.7,000. గతంలో మీరెప్పుడూ మిర్చికి కనీస మద్దతు ధరలు ప్రకటించలేదు. 5ఏళ్ల కిందట, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన పంటలకే కాకుండా, ప్రకటించని పంటలకూ, రాష్ట్రం మరికొన్ని పంటలను అదనంగా చేర్చి మొత్తంగా 24 పంటలకు మద్దతు ధరలు ప్రకటించి, పోటీవాతావరణం కల్పించి ధరలు పడిపోకుండా అడ్డుకోవడమేకాదు, ధరలు పెరిగేట్టుగా చూశామని గుర్తుచేశారు.
* ధాన్యం కొనుగోళ్లకు రూ.65,000 కోట్లు ఖర్చు చేయడమే కాకుండా, ఇతర పంటల కొనుగోళ్లకు మరో రూ.7,800 కోట్లు ఖర్చుచేసి రైతుకు అండగా నిలిచాం. మరి ఈ ధరలు ప్రకటించి అప్పటికీ, ఇప్పటికీ 5ఏళ్లు అయ్యింది. 5 ఏళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చులు పెరగవా? అప్పట్లో మిర్చి సాగుకు ఎకరాకు రూ.1లక్ష అయితే, ఇప్పుడు రూ.లక్షన్నర అయిన మాట వాస్తవం కాదా? మీరుకూడా మాలాగే ఇప్పుడు కొత్త మద్దతు ధరలు ప్రకటించి రైతులను ఆదుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయలేదు? అని దుయ్యబట్టారు.
* కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌చౌహాన్ సింగ్‌కు రాసిన లేఖలో మా హయాంలో మిర్చి రైతులకు మంచి ధరలు వచ్చాయని మీరే చెప్పారు. మీరు రాసిన లేఖ ప్రకారమే మా హయాంలో మిర్చికి మోడల్ ధర రూ.20,000 ఉంటే, గరిష్ట ధర రూ.27,000 పలికింది వాస్తవం కాదా? అని నిలదీశారు.
* మిర్చిరైతుల సంక్షోభంపై ఈ జనవరిలో ఉద్యానవనశాఖ అధికారులు నివేదించిన తర్వాత అయినా, మీరేమైనా పట్టించుకున్నారా? మిర్చి రైతుల పరిస్థితి అన్యాయంగా ఉందని, జోక్యం చేసుకోవాలని నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? పైగా తప్పుడు రాజకీయాలు చేస్తూ, మిర్చి కొనుగోళ్లతో సంబంధంలేని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకుంటారా? గతంలో ఎప్పుడైనా, ఏ రాష్ట్రంలోనైనా నాఫెడ్ మిర్చిని కొనుగోలు చేసిందా? మీచేతిలో ఉన్న మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయకుండా, ఎప్పుడూ మిర్చి కొనుగోళ్లు చేయని నాఫెడ్ కొనాలంటూ లేఖ రాయడం రైతులను నిలువునా మోసం చేయడం, మభ్యపెట్టడం కాదా?
* మిర్చిరైతులకు బాసటగా వెళ్లినందుకు మాపై కేసులు పెట్టారు. అలాంటప్పుడు ఈ ఫిబ్రవరి 15న, మీరు పాల్గొన్న మ్యూజికల్‌నైట్‌కు ఎన్నికలకోడ్ అడ్డం రాలేదా? నేను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా? పైగా మేము ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడంలేదు, నిన్నటి కార్యక్రమంలో పలానావారికి ఓటు వేయమనికూడా చెప్పలేదు, కనీసం మైక్‌లో కూడా మాట్లాడలేదు. అయినా అన్యాయంగా కేసులు పెట్టారు. ఇది అప్రజాస్వామికం కాదా?
* మీ హయాంలో పంటలకు కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా? పత్తి, పెసర, మినుము, కంది, టమోటా, మిర్చి, మొన్నటి ధాన్యం సహా అన్ని పంటల రైతులకు కనీసమద్దతు ధరలు లభించక మీరే వారిని సంక్షోభంలో నెట్టిన మాట వాస్తవం కాదా?
* రైతుకోసం మేం సృష్టించిన మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలు, ఈ క్రాప్ నిర్వీర్యం, ఉచిత పంటల బీమా నిర్వీర్యం, సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ నిర్వీర్యం, ఆర్బీకేల్లో కనీస మద్దతు ధరల పోస్టర్లు అతికించి, CM APP ద్వారా కొనుగోలు చేసే విధానం నిర్వీర్యం, నాణ్యతను ధృవీకరిస్తూ ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తూ, బ్లాక్‌లో అమ్మే పరిస్థితిని నిరోధిస్తూ చేసిన కార్యక్రమం నిర్వీర్యం, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ ల్యాబుల వ్యవస్థ నిర్వీర్యం, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సెపరేటు కాల్‌సెంటర్, టోల్ ఫ్రీ నంబరును నిర్వహించే వ్యవస్థ నిర్వీర్యం, ఆర్బీకేల్లో కియోస్క్‌లు పెట్టి, రైతులకు తోడుగా నిలిచే విధానం నిర్వీర్యం, సున్నావడ్డీ నిర్వీర్యం, పెట్టుబడి సహాయం నిర్వీర్యం, ధాన్యం కొనుగోలు కాకుండా ఇతర పంటల కొనుగోలుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి నిర్వీర్యం.. మొత్తంగా ఇలా వ్యవసాయరంగంలోని మేం తీసుకు వచ్చిన విప్లవాత్మక వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యంచేశారు. వ్యవసాయం దండగ అన్న మీ ఆలోచన, మైండ్ సెట్ మారలేదు చంద్రబాబుగారు. ఇప్పుడు కూడా కలరింగ్ ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు.
* మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేదిలేదు. నేను రైతు పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్నికేసులు పెట్టినా రైతులకోసం, ప్రజలకోసం నిలబడతాను. చంద్రబాబుగారూ… ఇప్పటికైనా తక్షణమే మిర్చి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోండి. ఈ సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా, వారికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించండి అని డిమాండ్ చేస్తూ.. మొత్తం 10 పాయింట్లుగా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
1. @ncbn గారూ, తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి ఉంది.కొనేవాడులేక రూ.10వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1,50,000 పైమాటే. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ, మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ సీఎం…
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 20, 2025