YS Jagan: సంచలనంగా మారిన సుగాలి ప్రీతి హత్య కేసుపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని ఆయన విమర్శించారు. 2017లో పదో తరగతి చదువుతున్న అమాయక బాలిక సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైందని గుర్తు చేసిన జగన్, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అసలు నిందితులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే కుటుంబానికి కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించినట్లు వెల్లడించారు.
కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా తమ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జగన్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు. సీబీఐ సిబ్బంది, వనరుల కొరత ఉందని చెబుతున్నా, దర్యాప్తుకు అవసరమైన సహకారం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని జగన్ ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో బాధిత కుటుంబానికి వచ్చే పెన్షన్‌ను కూడా నిలిపేశారని తల్లిదండ్రులు చెప్పారని వెల్లడించారు.
సిట్ రిపోర్టు, CDFD ల్యాబ్ నివేదికలు, డీఎన్‌ఏ ప్రొఫైల్ వివరాలు వంటి బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ సీబీఐ ద్వారా సమగ్ర దర్యాప్తు జరగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రశ్నించారు వైఎస్ జగన్.. న్యాయం కోసం మరోసారి తమను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు వైసీపీ పూర్తి అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున సంపూర్ణ న్యాయ సహాయం అందిస్తామని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
సుగాలి ప్రీతి కేసులో @ncbn గారి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం… ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన… pic.twitter.com/0RRSDHwQav
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 26, 2026
