CM Chandrababu: తిరుమల టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో సిట్ నివేదికపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారంపై ఏపీ కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. అసలు నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందన్న తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయంను అధికారులు కేబినెట్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో సిట్ నివేదిక అధికారికంగా అందిన తర్వాతే స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు స్పష్టమైన సూచనలు చేశారు.
Read Also: YS Jagan Padayatra: ప్రజల మధ్యే ఉంటా.. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తా..
కేబినెట్ సమావేశంలో మంత్రులతో కలిసి టీటీడీ నెయ్యి కల్తీ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రులు తీవ్రంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవమని అధికారులు స్పష్టం చేసినట్లు మంత్రులు వెల్లడించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన ఖాతాలో నాలుగున్నర కోట్ల రూపాయలు జమ అయిన అంశాన్ని మంత్రులు ప్రస్తావించారు. నెయ్యి సరఫరా చేసిన డెయిరీలకు అంత సామర్థ్యం లేదని, పాల సేకరణ సామర్థ్యం కూడా డెయిరీలకు లేదని అధికారులు వివరించినట్లు చెప్పారు. కాంట్రాక్ట్ తీసుకున్న కొన్ని డెయిరీలు రసాయనాలు మిశ్రమం చేసి నెయ్యి తయారు చేశాయని మంత్రులు పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో జరిగిన తప్పులను ఇప్పుడు తమపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని మంత్రులు వ్యాఖ్యానించారు. “తప్పు చేశారు.. కల్తీ జరిగిందని తేలింది.. ఇప్పుడు బుకాయింపులకు దిగుతున్నారు” అని మంత్రులు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిట్ నివేదిక వచ్చిన తర్వాతే మాట్లాడాలని మంత్రులకు సూచించారు. వైసీపీ నేరప్రవృత్తి ఇదే విధంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కోడికత్తి, బాబాయి గొడ్డలి, గులకరాయి కేసులను గుర్తు చేస్తూ, అప్పట్లో ఎలా వ్యవహరించారో ప్రజలకు తెలుసని అన్నారు. సిట్ ఏర్పాటు వద్దని సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలు, చివరకు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు జరిగి నివేదిక ఇచ్చినా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. వైసీపీ నేతలు తప్పులు చేసి వాటిని ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో మంత్రులందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సిట్ నివేదిక అధికారికంగా వెలువడిన తర్వాతే ప్రభుత్వ స్పందన ఉంటుందని స్పష్టం చేశారు.