AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అభివృద్ధి, విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి, పర్యాటక రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ చేసే అంశంపై చర్చ జరిగింది.
Read Also: Plane Crashes: విమాన ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడిన నాయకులు వీరే!
ఇక, పలమనేరులో లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు కోసం భూ బదిలీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖపట్నంలో 500 చదరపు గజాల స్థలం కేటాయించేందుకు కూడా అంగీకారం తెలిపింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు గ్రూప్–1 ఉద్యోగం కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించింది.
మరోవైపు, అమరావతి పరిధిలో వీధిపోటు భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్‌గ్రేడ్‌కు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు సంస్థలకు భూకేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలిపింది. అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫైవ్ స్టార్ రిసార్ట్ ఏర్పాటు, అలాగే కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్క్ నిర్మాణానికి భూకేటాయింపులు చేయాలని నిర్ణయించింది. ఇదే సమావేశంలో పలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు, ఇంధన శాఖకు సంబంధించిన పలు పరిపాలన అనుమతులకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.