Heavy Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక, అల్పపీడన ప్రభావంతో ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే చాన్స్ ఉంది.
Read Also: Hyderabad: ఐకియా వాహనంలో గంజాయి సరఫరా.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఇస్తున్న డ్రైవర్లు
అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. గోపాలపట్నం ఇందిరానగర్‌లో ప్రహరీ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాలకు తోడు, కారుమబ్బులు కమ్ముకోవడంతో వాహనదారులు పట్టపగలే లైట్లు వేసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో అల్పపీడనం పంటలపై ప్రభావం చూపుతోంది. నాన్ స్టాప్‌గా పడుతున్న వర్షానికి పత్తి పంట దెబ్బతింది. చేతికి అందే సమయంలో పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజులుగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
Read Also: CM Chandrababu: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. 48 గంటల్లోనే డబ్బులు..!
అల్పపీడనం వల్ల సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఉప్పాడ తీరంలో అలల ఉధృతి ఎక్కువైంది. సూరాడపేటలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనం కుప్పకూలింది. ఉప్పాడ, సుబ్బంపేట, సూరాడపేట, మాయపట్నం, అమీనాబాద్, కోనపాపపేట గ్రామాల దగ్గర తీరం కోతకు గురైంది. ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. తుఫాన్లు వచ్చిన ప్రతిసారి తీరం కోతకు గురై పదులు సంఖ్యలో నివాసాలు సముద్రగర్భంలో కలిసిపోతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. తీర ప్రాంతం కోతకు గురికాకుండా ప్రభుత్వం శాశ్వత పరిస్కారం చూపాలని కోరుతున్నారు.