బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెగని రీతిలో భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచింది. విజయవాడలో ఉదయం నుంచి కంటిన్యూస్‌గా వర్షం కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. ఇది బుధవారమే తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాక (ఐఎండీ) పేర్కొంది.