Pawan Kalyan: సంక్షేమ పథకాల విషయంలో జనసేన పార్టీకి ఎలాంటి వ్యతిరేకత లేదని ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నిజంగా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వ సహాయం, ఉచిత పథకాలు అవసరమేనని ఆయన పేర్కొన్నారు. అయితే సంక్షేమం పేరుతో మాత్రమే ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదని, ప్రజలు అభివృద్ధిని కూడా కోరుకుంటారని వ్యాఖ్యానించారు.
కేవలం బటన్ నొక్కి నగదు బదిలీలు చేస్తే ప్రజలు ఎప్పటికీ ఓట్లు వేస్తారనే భావన సరికాదని అన్నారు పవన్ కల్యాణ్.. అలాంటి రాజకీయాలకు నిలువెత్తు ఉదాహరణ గత ప్రభుత్వం అని, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కూడా సమానంగా ఉండాలని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం వంటి అంశాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని పవన్ విమర్శించారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక వసతులు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
“ఎంతసేపు బటన్ నొక్కి డబ్బులు పంపించామని చెప్పడం కంటే, ప్రజలు ప్రయాణించే రోడ్లు ఎవరు వేశారు? దశాబ్దాలుగా నిర్మించని రహదారులు ఇప్పుడు ఎలా నిర్మితమయ్యాయి? అనే విషయాలను కూడా చూడాలి” అని అన్నారు పవన్ కల్యాణ్.. ప్రజలకు సంక్షేమం ఎంత అవసరమో, నాణ్యమైన రహదారులు, ఆసుపత్రులు, ఇతర మౌలిక వసతులు కూడా అంతే అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు తమ బాధ్యతగా అభివృద్ధిపై దృష్టి పెట్టకపోతే, ఎన్ని ఉచిత పథకాలు అమలు చేసినా ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందరని పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

