Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చే కీలక ఘట్టం ఈ నెల 28వ తేదీన ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర రాజధానిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సహా మొత్తం 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన నూతన భవనాలు, అధికారుల నివాస భవనాల నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం అమరావతిలోని CRDA ప్రధాన కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదికగా జరగనుంది. అన్ని బ్యాంకుల భవనాలకు ఒకేసారి పునాది రాయి వేయనున్నారు.
Read Also: YS Jagan-KTR: ఒకే ఫ్రేమ్‌లో వైఎస్ జగన్, కేటీఆర్.. ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్..!(ఫొటోస్)
ఇక, ఈ వేడుకలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారాయణ, నారా లోకేష్ తదితరులు హాజరు కానున్నారు. అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో.. CRDA ఇప్పటికే ఈ వివిధ బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. అయితే, ఒకే రోజున, ఒకే వేదికపై ఇన్ని బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన చేయడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.