AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతోన్న లిక్కర్ స్కాం కేసులో సిట్ విచారణలో నిందితులే సిట్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారట.. కస్టడీలో సిట్ అధికారులకు లిక్కర్ స్కాం కేసు నిందితులు రాజ్ కసిరెడ్డి, చాణక్య పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టుగా తెలుస్తోంది.. గత నాలుగు రోజులుగా నిందితులను విచారిస్తున్నారు సిట్ అధికారులు.. నెలకి ఒక సిమ్ కార్డు నిందితులు వినియోగించినట్టు గుర్తించిన సిట్.. సిమ్ కార్డులు ఎవరు ఇచ్చారని అడగడంతో తాము కొత్త సిమ్ లు వాడలేదని నిందితులు చెప్పారట.. ఇక, తాను ఐటీ అడ్వైజర్ ను అని తనకు లిక్కర్ పాలసీతో సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి సమాధానం ఇచ్చారట..
ఇక, ఎంపీ మిథున్ రెడ్డి ఇతరులతో విజయసాయి రెడ్డి ఇంట్లో మీటింగ్ ఎందుకు పెట్టారని సిట్ ప్రశ్నించగా.. తామంతా పార్టీ నేతలం కాబట్టి పార్టీ ఎదుగుదల గురించి పార్టీ నేతలతో చర్చకు సమావేశమైనట్టు రాజ్ కసిరెడ్డి సమాధానం ఇచ్చారట.. మరోవైపు.. తనకు హైదరాబాద్‌లో టీ గ్రిల్స్ రెస్టారెంట్ ఉందని అక్కడకి రాజ్ కసిరెడ్డి వచ్చేవారని.. అక్కడ తమకు పరిచయమని తెలిపాడట చాణక్య.. రాజ్ కసిరెడ్డితో కేవలం పరిచయం మాత్రమే ఉందని.. ఎటువంటి లావాదేవీలు చేయలేదని చాణక్య చెప్పుకొచ్చారట.. డిస్టలరీస్ నుంచి వసూలు చేసిన ముడుపులు ఎవరికి ఇచ్చారని అడగ్గా.. అసలు కేసుతో సంబంధం లేనప్పుడు..? డబ్బులు ఎక్కడివి, ఎవరికి ఇస్తాను అని సిట్ అధికారులకు రాజ్ కసిరెడ్డి చెప్పినట్టు సమాచారం.. వైసీపీ ప్రభుత్వం మంచి లిక్కర్ పాలసీ తీసుకు రావాలని భావిస్తున్నట్టు మాత్రమే తనకు తెలుసని.. మిగతా విషయాలు తనకు తెలియదని సిట్ అధికారులకు చెప్పారట రాజ్‌కసిరెడ్డి.. అయితే, కేసులో లోతుగా విషయాలపై ఆరా తీద్దామనుకున్న సిట్ అధికారులకు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వకుండా.. చుక్కలు చూపిస్తున్నారట నిందితులు..