Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు

Perni Nani

Perni Nani

Perni Nani: రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. డీఎస్సీ అంశంపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. విజయవాడలో నిరసనకారులపై దాడులు జరిగాయని, దీక్షా శిబిరంపై నేరుగా దాడి చేశారని, మహిళలపై దాడులు జరిగినా పోలీసులు స్పందించలేదని విమర్శించారు. మల్లాది విష్ణుపై దాడి జరిగినప్పటికీ బాధితుడినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించడం తప్పా అని పేర్ని నాని నిలదీశారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అండతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, బోండా ఉమా చర్యలకు ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉందని వ్యాఖ్యానించారు. ముద్రగడ పద్మనాభం విగ్రహం తయారు చేయించి ఎందుకు ఏర్పాటు చేయలేదని, వంగవీటి రంగా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదని ప్రశ్నించారు. దాడులు చేసినంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాన్ని ఆపబోదని స్పష్టం చేశారు.

పోలీసులను ప్రభుత్వం ప్రైవేట్ సైన్యంలా ఉపయోగిస్తోందని పేర్ని నాని ఆరోపించారు. డీజీపీకి అనేకసార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతోందన్నారు. జగన్ పర్యటనల సందర్భంగా భద్రతా లోపాలు పునరావృతమవుతున్నాయని, వాటిపై ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికే పర్యటిస్తున్నారని, ఆయన భద్రతను పోలీసులు సమర్థంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో అవినీతి, శాంతిభద్రతల పరిస్థితిపై కూడా పేర్ని నాని ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న రాజకీయ ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రతిపక్షాల గొంతును అణచివేయాలనే ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.