YS Jagan: ఈసారి కచ్చితంగా మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. జగన్ 2.O పాలనలో మీకు కావాలనుకుంటున్న విధంగా జగన్ ను చూస్తారంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ పాత బీహార్ లా తయారైందని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు.. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేని సీఎం చంద్రబాబు నాయుడు.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు..
Read Also: Minister Sandhya Rani: వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే.. యుగాంతం అయిపోవాలి..!
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.. సమావేశానికి హాజరైన ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు దిశా నిర్దేశం చేశారు జగన్.. మంచి చేశాం కాబట్టే ఇవాళ వైసీపీ నేతలు గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారని ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన.. వైసీపీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడింది. కేవలం ఇచ్చిన మాటకోసం.. ఎందాకైనా వెళ్లామన్నారు జగన్.. ఆ ప్రస్థానంలో వైసీపీ ఆవిర్భవించింది. బలమైన పార్టీగా ఎదిగింది. ఆరోజు నుంచి ఈరోజు వరకూ విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన వైసీపీలో ఈ రెండింటిని చూసి తనతో పాటుగా అందరూ అడుగులో అడుగు వేశారన్నారు.. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మారు. ప్రతి ఇంటికీ తన మనుషులను చంద్రబాబు పంపాడు. కరపత్రాలు, బాండ్లు చంద్రబాబు పేరిట పంచారు. ప్రతి వర్గాన్నీ మోసం చేశారు. పదిశాతం ప్రజలు జగన్ చేశాడు కాబట్టి, చంద్రబాబుకూడా చేస్తాడని నమ్మారు కాబట్టే 50 శాతం నుంచి 40 శాతానికి వైసీపీ ఓటు షేరు తగ్గింది.. చంద్రబాబు వచ్చి 11 నెలలు అయిపోయింది. రెండు బడ్జెట్లు పెట్టిన చంద్రబాబు హామీలు నెరవేరుస్తాడని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నా… హామీలు అమలు చేయాలంటే భయం వేస్తుందంటూ చంద్రబాబు రాష్ట్రానికున్న అప్పులపై అబద్ధాలు చెప్తున్నారన్నారు జగన్..
Read Also: Vivo V50e: 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లే, IP69 రేటింగ్స్, 50MP కెమెరాతో లాంచైన వివో V50e
ఏపీ పాత బీహార్ లా తయారైందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన ఆరోపించారు.. వైసీపీ అన్నా.. వైసీపీ కార్యకర్త అన్నా కూడా చంద్రబాబుకు భయం. హామీల అమల్లో, పాలనలో ఘోరంగా ఆయన విఫలమయ్యారు. టీడీపీ కేడర్, నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలకు దగ్గరకు వెళ్తే కచ్చితంగా నిలదీస్తారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన చేస్తున్నారు.. అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రతి గ్రామంలోనూ మద్యం షాపులు, బెల్టుషాపులు యధేచ్చగా వెలిశాయి. పేకాట క్లబ్బులు, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలు నడుస్తున్నాయి. వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి. చంద్రబాబు పాలనలో ఆరు నెలలు తిరక్కముందే ప్రజలకు తోడుగా మనం నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో వైసీపీ 10కి 9 చోట్ల గెలిచింది.. అక్కడ గెలవాల్సింది వైసీపీ అయితే అక్కడ ఎన్నికను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలకు భద్రత ఇవ్వాల్సింది పోయి, పోలీసులే ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు చేశారు. రామగిరి ఎస్సై, ఎంపీటీసీల వాహనం ఎక్కాడు. వీడియో కాల్‌లో ఎమ్మెల్యేతోనూ, ఎమ్మెల్యే కుమారుడితోనూ టీడీపీకి అనుకూలంగా ఓటేయమని బెదిరించారు. వైసీపీ పార్టీ ఎంపీటీసీలు ఎన్నిక సమయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వేరే మండల కేంద్రానికి తీసుకెళ్లి బైండోవర్ చేసే కార్యక్రమం చేశారు. దీనికి వ్యతిరేకంగా ధర్నాచేస్తే పార్టీ జిల్లా అధ్యక్షురాలు మీద, ఇన్‌ఛార్జి మీద కేసులు పెట్టారు. దీని తర్వాత మన పార్టీ తరఫున యాక్టివ్‌గా ఉన్న లింగమయ్యను హత్యచేశారని ఆరోపించారు.. ఇంతలా దిగజారిపోవాల్సిన అవసరం ఉందా.. ఏపీ పూర్వపు బిహార్ రాష్ట్రంలా తయారయ్యింది.. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం యుద్ధం చేస్తున్నాం.. కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడాలి.. వైసీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది.. జగన్ 2.O లో ప్రతి కార్యకర్తకు జగన్ భరోసాగా ఉంటాడని స్పష్టం చేశారు.. సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, శిల్పా రవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సహా పలువురు నేతకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు..