Tahawwur Rana: 26/11 నిందితుడు, ఇండియా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది తహవూర్ రాణా ఇండియాకు చేరుకున్నాడు. అమెరికా అత్యున్నత న్యాయస్థానాలు ఇండియాకు అప్పగించేందుకు అనుమతించడంతో, ఇతడిని భారత్ తీసుకువచ్చారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాడు. మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది కావడంతో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. పాలెం ఎయిర్ పోర్టు నుంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారని తెలుస్తోంది.
ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్ల వంటి అధిక ప్రమాదం ఉన్న వ్యక్తుల్ని కోర్టుకు లేదా విచారణ ఏజెన్సీల కార్యాలయాలకు తరలించడానికి భద్రతా సంస్థలు సాధారణంగా ఉపయోగించే బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం, కాన్వాయ్‌లో సాయుధ వాహనాలను తహవూర్ రాణా తరలింపులో ఉపయోగిస్తున్నారు. విమానాశ్రయంలో SWAT (స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్) కమాండోలను మోహరించారు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌ను హై అలర్ట్‌లో ఉంచారు.
Read Also: Yashasvi Jaiswal: పృథ్వీ షా ఏమయ్యాడో గుర్తున్నాడుగా.. యశస్వి జైస్వాల్‌కు మాజీ క్రికెటర్ హెచ్చరిక!
నవంబర్ 26, 2008న ముంబైలోని 12 ప్రదేశాలలో పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడులు చేసిన 166 మందిని హతమార్చారు. దాడిలో అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఇతడిని 2012లో ఉరితీశారు. ఢిల్లీ కోర్టు 26/11 ఉగ్రవాద దాడుల విచారణ రికార్డుల్ని తీసుకుంది. తహవూర్ రాణా భారత్ రాకముందే ముంబై దాడుల రికార్డుల్ని కోర్టు తీసుకుంది. ముంబై నుంచి కేసు రికార్డుల్ని పొందాలని కోరుతూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చర్య తీసుకుంది.
64 ఏళ్ల ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు, నిఘా సంస్థల అధికారులు, ఉగ్రవాది నిరోధక మరియు ఫోరెన్సిక్ సైకాలజిస్టులు కూడిన టీం ప్రశ్నించనుంది. 26/11 దాడుల వెనక ఉన్న సంస్థల ప్రమేయం, పాకిస్తాన్ హస్తం, ఎవరి దగ్గర నుంచి మార్గనిర్దేశాలు అందాయి, ఎవరు మద్దతు ఇచ్చారనే విషయాలపై విచారణ జరగనుంది.