Heavy Rains and High Temperature in AP: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండాల్సిన సమయంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.. ఓవైపు వానలు దంచికొడుతుంటూ.. మరోవైపు ఎండలు బంబేలిస్తున్నాయి.. ఇక, రానున్న రెండు రోజుల్లూను.. భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు, మరికొన్ని చోట్ల ఎండలు భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.. ఈ వాతావరణ మార్పుల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..
Read Also: Turkey: అప్పుడు మాల్దీవులు, ఇప్పుడు టర్కీ.. ఇండియా దెబ్బకు విలవిల..
రేపు అనగా.. బుధవారం 14వ తేదీన రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.. ఇక, శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, కోనసీమ, పల్నాడు , గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఈ సమయంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ఈ సమయంలో భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. ఇక, గురువారం రోజు అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. పల్నాడు, ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.. మరోవైపు.. రేపు ఉష్ణోగ్రతలు 41-43 డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని.. విజయనగరంలోని మూడు మండలాలు, పార్వతీపురంమన్యంలోని 8 మండలాలు, తూర్పుగోదావరిలోని ఒక మండలం.. మొత్తం 12 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉండగా.. మరో 35 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్..