Deputy CM Pawan Kalyan: గతంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు అని అసెంబ్లీ వేదికగా దుయ్యబట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఇప్పుడు జనసేన సభ్యులు కూడా ఎవరూ గీత దాటరన్న ఆయన… తప్పు చేస్తే వారిపైనా చర్యలు తీసుకోవాలని చెబుతున్నా అన్నారు.. నేను తప్పు చేసినా నన్ను కూడా వదలొద్దు అని సూచించారు.. రాష్ట్ర భవిష్యత్తు పునర్ నిర్మాణం కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడిన ఆయన.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లి బాధ్యత కూటమి ప్రభుత్వానిది. ప్రతిపక్ష నేతలను కూడా గౌరవించే సంస్కారం సీఎం చంద్రబాబుకు ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఎంతో కష్టపడి రాజధాని నిర్మాణం చేపట్టాం. కానీ, వైసీపీ వచ్చి మూడు రాజధానులని చెప్పింది. ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమరావతి రాజధాని కావాలన్నారు.
Read Also: Polimera 2 Producer: చంపేస్తామంటున్నారు… దిల్ రాజుకు పొలిమేర 2 నిర్మాత లేఖ..!
ఇక, కేంద్రం రాజధాని నిర్మాణానికి రూ 15 వేల కోట్లు ఇవ్వటం స్వాగతిస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ పాలనలో పోలవరం కట్టలేక పోయారు, రివర్స్ టెండరింగ్ అన్నారు. పెట్టుబడులు రాకుండా చేశారు. ఖజానా ఖాళీ చేశారు, సహజ వనరుల దోపిడి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు అంటూ విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్.. మరోవైపు.. పవన్ కల్యాణ్ క్లిష్ట సమయంలో కీలకంగా వ్యవహరించారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం విదితమే.. రాష్ట్రం కోసం టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ అని పేర్కొన్న ఆయన.. ఓట్లు చీలకూడదు.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని పవన్ కల్యాణ్ సామాజిక బాధ్యతతో ఆలోచించారని కొనియాడారు.. ఇక, రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సమైక్యంగా పని చేస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే..