బుడమేరు గండ్లు పడిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. మూడు గండ్లు పూడ్చిన విధానాన్ని మంత్రి నిమ్మల, ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. గండ్ల పటిష్టతకు తీసుకుంటున్న చర్యలను మంత్రి సీఎంకి తెలిపారు. భవిష్యత్తులో కూడా బుడమేరు డైవర్షన్ కెనాల్, బుడమేరు కాల్వ వల్ల నగరానికి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం వచ్చిన వరద కంటే మించిన స్థాయిలో వరదొచ్చినా తట్టుకునేలా గండ్లని పటిష్టం చేయాలని చంద్రబాబు తెలిపారు. బుడమేరుకు ప్రస్తుతం వచ్చిన వరద గతంలో ఎన్నడూ రాలేదని.. బుడమేరుకు వచ్చిన వరద విజయవాడ ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేసిందన్నారు. పులివాగు నీరంతా శాంతి నగర్ ద్వారా నగరంలోకి వచ్చిందని.. ఆర్మీ కూడా ఈ గండ్లను పూడ్చలేక పోయిందని సీఎం తెలిపారు. బుడమేరు గండ్లను పూడ్చకుంటే నగరంలోకి వరద నీరు వస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇలాంటి సంక్లిష్టమైన గండ్లను మంత్రి నిమ్మల నేతృత్వంలో పూడ్చారని సీఎం చెప్పారు. కష్టతరమైన గండ్లను పూడ్చిన నిమ్మల, ఇరిగేషన్ అధికారులకు అభినందనలు తెలిపారు. బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో గత ప్రభుత్వంలో కబ్జాకు గురైంది.. దుర్మార్గుడైన నేత ఐదేళ్లు పాలించాడని దుయ్యబట్టారు. అభివృద్ధి చేయకున్నా ఫర్వాలేదు.. కానీ గత పాలకులు వ్యవస్థలను భ్రష్టు పట్టించేలా చేశారని ఆరోపించారు. ఓ దుర్మార్గుని పాలన వల్ల లక్షలాది మంది ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు తెలిపారు. దాతలు చాలా మంది ముందుకొస్తున్నారని.. చాలా మంది సహకరిస్తున్నా, వైసీపీ మాత్రం విషం చిమ్ముతుందని దుయ్యబట్టారు. మరోవైపు.. బోట్లు వదిలి పెట్టి ప్రకాశం బ్యారేజీని డామేజ్ చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఇంకా సిగ్గు లేకుండా వైసీపీ సమర్ధించుకుంటోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Electrical tractor: రూ.14 ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం.. ఈ-ట్రాక్టర్ స్పెషల్ ఇదే..!
ఎంతో మంది రైతులకు నీరందించిన ప్రకాశం బ్యారేజీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ అని చంద్రబాబు మండిపడ్డారు. పది రోజుల పాటు కలెక్టరేట్లోనే ఉన్నాను.. సహయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఐఏఎస్ అధికారులూ ఫీల్డుకెళ్లారు.. ప్రజలంతా సహకరించారని అన్నారు. పది రోజుల్లో పెద్ద విపత్తును ఎదుర్కొన్నాం.. యుద్దమే చేశామని సీఎం చెప్పారు. వైసీపీ విద్వేషాలను రెచ్చగొట్టింది అని పేర్కొన్నారు. గండ్లు పడకుండా ఉంటే.. ఈ విపత్తును ఎదుర్కొవడం ఈజీగా ఉండేది.. సహయక చర్యలు కూడా పూర్తి స్థాయిలో చేయలేనంతగా వరద వచ్చిందని తెలిపారు. కేంద్రంతో మాట్లాడి పవర్ బోట్లు, హెలీకాప్టర్లను రప్పించాం.. పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయన్నారు. ప్రాణ నష్టం తగ్గించాం.. కానీ ఆస్తి నష్టాన్ని తగ్గించ లేకపోయామని తెలిపారు. ఫైరింజన్లతో ఇళ్లను శుభ్రం చేయిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.