అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో ఇంధన శాఖపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఒకప్పుడు ఉండేదని ఆరోపించారు. తాను పాదయాత్ర చేసినపుడు కొన్ని సంఘటనలు తనను కలిచి వేశాయన్నారు. ప్రస్తుతం 9 గంటలు రైతులకు నిర్విరామంగా కరెంట్ ఇస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. విద్యుత్తు రంగంలో ఎన్నో సంస్కరణలు టీడీపీ తెచ్చింది.. కరెంట్ బిల్లుల విషయంలో కీలక సంస్కరణలు తెచ్చామని పేర్కొన్నారు. తనను ప్రపంచ బాంక్ జీతగాడు అన్నా కూడా పడ్డాను.. ఒక అసమర్ధ పాలన వల్ల చీకటి రోజులు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలోచన లేకుండా పీపీఏలను రద్దు చేశారు.. దావోస్‌లో కూడా పీపీఏలపై చర్చ జరిగింది.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజల అభివృద్ధిని లెక్కిస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మర్పులు వచ్చాయి.. గతంలో కరెంటు కోతల సమయంలో రైతుల అవస్థలు ప్రత్యక్షంగా పరిశీలించానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రైతుల ఇబ్బందులు చూశాక పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.. విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రపంచ బ్యాంకు జీతగాడని అవహేళన చేశారని అన్నారు. అప్పుడే డిస్కమ్‌లు, నియంత్రణ మండలి, ఎనర్జీ ఆడిటింగ్ అనేది మొదలు పెట్టామని అన్నారు. గతంలో ట్రాన్స్‌మిషన్ నష్టాలు 23 శాతం అని దేశంలో తొలిసారి నిర్ధారించింది కూడా ఏపీనేనని చంద్రబాబు చెప్పారు. విభజన తర్వాత కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాం.. టీడీపీ హయాంలో చేసిన విద్యుత్ సంస్కరణలు వాడుకుని అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఎన్టీపీఎస్ లాంటి ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను 83 శాతం పీఎల్ఎఫ్‌తో నడిపించామన్నారు. చాలా ప్రైవేటు సంస్థలకూ అది సాధ్యం కాదని తెలిపారు.
Anupama : ‘పరదా’ మూవీలో మరో స్టార్ హీరోయిన్..
ఈ పరిపాలన మార్పులు ప్రజలు గుర్తించాలన్నదే తమ అభిప్రాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 30 ఏళ్ల పాలన సమయాన్ని బేరీజు వేసుకుంటే వాస్తవాలు వెలుగు చూస్తాయి.. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని లోటు పరిస్థితికి తీసుకెళ్లింది వైసీపీ ప్రభుత్వమని దుయ్యబట్టారు. పరిశ్రమలు కరెంటు వాడితే సర్ చార్జీ విధించిన పరిస్థితి గత ప్రభుత్వానిదని ఆరోపించారు. 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత రాష్ట్ర విభజన సమయంలో ఉంది.. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీలో తలసరి విద్యుత్ వినియోగం 23 శాతం మేర పెరిగింది.. సౌర, పవన విద్యుత్‌ను 7700 మెగావాట్లు మేర ఉత్పత్తి చేసిన మొదటి రాష్ట్రం ఏపీనేనని సీఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం వల్ల అందులో జల విద్యుత్ కేంద్రం ఆగిపోయి 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రాలేదని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీల పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్ల భారం వేశారు.. పీఎం, సూర్యఘర్ స్కీంలో ప్రతి ఇంటిలో కరెంట్ ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. 20 లక్షల మందికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.. టారిఫ్ అడ్జస్ట్‌మెంట్, ఫ్యూయల్ సర్ ఛార్జ్, ట్రూ ఆప్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పి రూ. 32,166 కోట్లు ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో విద్యుత్ వినియోగం కూడా 4.6 శాతం మేర తగ్గిపోయింది.. వినియోగదారులు, విద్యుత్ వ్యవ్యస్థపైనా గత ప్రభుత్వం వేసిన భారం రూ.1 లక్ష కోట్లు అని ఆరోపించారు. విద్యుత్ రంగంలో వారసత్వంగా కొన్ని సమస్యలు తమ ప్రభుత్వానికి వచ్చాయని చంద్రబాబు అన్నారు. సెకీ ద్వారా చేసుకున్న పవర్ సప్లై అగ్రిమెంట్ రాష్ట్రానికి భారంగా మార్చేశారు.. ఒకసారి సంతకాలు చేసిన తర్వాత ప్రభుత్వంగా దాన్ని వెనక్కు తీసుకోలేం ఇలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని సరిచేసేందుకు ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తోందని పేర్కొన్నారు.
IT Freshers: ఐటీ ఫ్రెషర్స్‌కి గుడ్‌న్యూస్.. ఏకంగా 1.5లక్షల ఉద్యోగాలు!
భూతాపం వల్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ, బయోప్యూయెల్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను స్మార్ట్ గ్రిడ్ ద్వారా సరఫరా చేయాలని ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. డెమాక్రాటైజేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నది ఇప్పుడు ఓ కీలక విధానం.. అలాగే ప్రోస్యూమర్ అన్నది ఇప్పుడు ఓ కొత్త పదం, ప్రొడ్యుసర్ కమ్ కంజ్యూమర్‌గా ప్రతీ ఇల్లు మారాలని అన్నారు. 2 కిలోవాట్ల సామర్ధ్యంతో సౌర ఫలకాలను ప్రతీ ఇంటిపైనా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.. వందశాతం మేర సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా ఏపీ మారాలని పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 10 వేల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ రావాలి.. ప్రతీ ఇంటికీ 240 యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటు వినియోగం 100 యూనిట్ల మేర ఉంటోంది.. మిగతా విద్యుత్ అంతా డిస్కమ్‌లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తాయని పేర్కొన్నారు. 20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ వచ్చే పరిస్థితి ఉంటుంది.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాల్లోనూ సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది 20 లక్షల ఇళ్లపై ఈ తరహా రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్లు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. తద్వారా 1440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అటు సోలార్ పంప్ సెట్ల వద్ద కూడా సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది.. రైతులు కూడా ఈ సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిస్తున్నానని చెప్పారు. సబ్ స్టేషన్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం ద్వారా పంపిణీ నష్టాలను అరికట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు 9 శాతంగా ఉన్నాయి.. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తామన్నారు. 960 మెగావాట్ల జల విద్యుత్ కూడా పోలవరం ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.