CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలంటే పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, తాను ముఖ్యమంత్రి అయిన సమయంలో హైదరాబాద్‌లో పెద్దగా ఆసుపత్రులు లేకపోయాయని గుర్తు చేశారు. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి కోడెల శివప్రసాద్‌ రావు ను గల్ఫ్ దేశాలకు పంపించి అక్కడి హాస్పిటాలిటీ వ్యవస్థను అధ్యయనం చేయించామని తెలిపారు. ఆ సమయంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్లే హైదరాబాద్ దేశానికి మెడికల్ హబ్‌గా మారిందన్నారు.

ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వైద్యులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నేర్చుకుంటూ తమ రంగంలో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు, యువతలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే తాను కలలు గన్న అమరావతి నిర్మాణం సాకారం అవుతోందని చంద్రబాబు అన్నారు. ఇటీవల శంఖుస్థాపన చేసిన యూనివర్సిటీ ద్వారా లక్ష వరకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం వెల్లడించారు. 2027 నాటికి యూనివర్సిటీ భవనం పూర్తవుతుందని, ఆ భవనాన్ని తానే ప్రారంభిస్తానని పేర్కొన్నారు.

విశాఖపట్నంలో కూడా భారీ పెట్టుబడులు రాబోతున్నాయని సీఎం తెలిపారు. వచ్చే ఆగస్టు 15 కంటే ముందుగానే Google విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు. అలాగే ArcelorMittal సంస్థ 2028 డిసెంబర్ నాటికి తన తొలి దశ పనులను విశాఖ వేదికగా పూర్తి చేస్తుందని వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వం ఆటోపైలెట్ విధానంలో ఇస్తుందని, నిర్ణీత గడువులో నిర్మాణం పూర్తి చేయడం మాత్రం సంస్థ బాధ్యత అని స్పష్టం చేశారు. వైద్య రంగంలో డాక్టర్ల కంటే నర్సుల పాత్ర ఎంతో కీలకమని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ కంటే మెరుగైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నగరం ఎంత అభివృద్ధి చెందితే ప్రజల భవిష్యత్తు అంత బాగుంటుందని పేర్కొన్నారు. కృష్ణా నదిపై మరిన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తే అమరావతి అద్భుత నగరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అమరావతి మాత్రమే కాకుండా విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. “రాళ్లసీమను రత్నాల సీమగా మారుస్తాం” అంటూ సీఎం చంద్రబాబు భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..