Group-2 Mains Exam: గ్రూప్ 2 పరీక్షలు నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది.. హరిజెంటల్ రిజర్వేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తదుపరి చర్యలు నిలుపుదల చేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిలుపుదల సాధ్యం కాదని స్పష్టం చేసింది.. పరీక్ష జరగకుండా ఉంటే అర్హులైన అభ్యర్థుల ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయని పేర్కొంది.. గ్రూప్ -2 ప్రధాన పరీక్షకి 92,250 మంది అర్హత సాధించారన్న కోర్టు.. వీరిలో హారిజాంటల్ రిజర్వేషన్ అభ్యంతరంపై ఇద్దరు మాత్రమే కోర్టుకు వచ్చారని తెలిపింది.. మొత్తంగా ఈ సమయంలో గ్రూప్-2 పరీక్ష నిలుపుదల చేయటం కుదరదని తేల్చేసింది ఏపీ హైకోర్టు.. అయితే, దీనిపై పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ.. కేసు తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..
Read Also: Chilli Prices: మిర్చి ధరలపై ఏపీ ప్రతిపాదనలు.. రేపు కేంద్రమంత్రి కీలక సమావేశం..
కాగా, ఈ నెల 23న జరిగే ఏపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు సీఎస్ విజయనంద్. ఏపీపీఎస్సీ చైర్మన్ అనూరాధతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎస్.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టర్. ఎస్పీలు పరీక్షలు నిర్వహించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.. 23వ తేదీన 175 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని.. 92,250 మంది అభ్యర్థులు హాజరు అవుతారని పేర్కొన్నారు.. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1.. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఎగ్జామ్స్ ఉండగా.. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ విధించనున్నారు పోలీసులు..