CM Chandrababu: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు.. అంతేకాదు.. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సైతం వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ రాశారు.. కేంద్ర బలగాలతో జగన్‌కు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.. అయితే, ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్ భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లో ఉందని.. ఇలాంటప్పుడు ఎక్కడికీ అనుమతి లేకుండా వెళ్లకూడదు.. కానీ, ఈసీ నియమావళిని ఉల్లంఘిస్తూ జగన్ మిర్చి యార్డుకు వెళ్లారని మండిపడ్డారు.. ముందస్తు అనుమతి లేకుండా వెళ్లి భద్రత కల్పించాలని అడగడం సబబు కాదని హితవుచెప్పారు.. అయినా, మేం వెళ్తాం, రౌడీయిజం చేస్తాం అంటే ఎలా? అని నిలదీశారు.. రేపు నేరాలు చేస్తాం.. పోలీసుల రక్షణ కల్పించాలని కూడా అడుగుతారు.. ఇది నాకు సంబంధించిన విషయం కాదన్న ఆయన.. అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..