CM Chandrababu Aerial Survey: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత బలమైన తుఫాన్‌గా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కోనసీమలోని తీరప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఓడలరేవు ఓఎంజీసీ టెర్మినల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఓడలరేవులోని. తుఫాన్ పునరవాసి కేంద్రాలను పరిశీలించారు.. తుఫాన్ బాధితులను పరామర్శించారు.. రోడ్డు మార్గం ద్వారా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చేరుకున్న ఆయన.. తుఫాన్ కు నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించారు.. పంట నష్టాలకు సంబంధించి రైతులను అడిగి తెలుసుకున్నారు.. వరి పైరు నేలకొరిగి పోవడంతో దిగుబడి తగ్గిపోతుందని ముఖ్యమంత్రి ఎదుట వాపోయారు రైతులు.. ఎకరానికి 20 వేల నుండి 30 వేల రూపాయల వరకు నష్టం ఉంటుందని అంటున్నారు..
ఇది పెనువిపత్తు.. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు.. గతంలో తుఫాన్ల సమయంలో పనిచేసిన అనుభవం నాకుందన్న ఆయన.. మొంథా తుఫాన్‌పై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం అన్నారు.. అయితే, ఈ తుఫాన్ వల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందన్నారు.. ఏరియల్ సర్వే తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందు జాగ్రత్తలు తీసుకుని మొంథా తుఫాన్ వల్ల ప్రాణ నష్టం లేకుండా చూశాం అన్నారు.. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నాం అని వెల్లడించారు.. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైందన్నారు.. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు.. కౌలు రైతులకు పరిహారం అందిస్తాం అన్నారు.. ఇక, మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నట్టు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..