Cabinet Sub-Committee: గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన భవనాలపై పెద్ద వివాదం రేగింది.. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.. ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైన కమిటీ.. ఈ రోజు 5వ సమావేశం నిర్వహించింది.. ఈ సమావేశంలో గత నాలుగు భేటీల్లో తీసుకున్న నిర్ణయాలపై సమగ్రంగా చర్చ కొనసాగింది. సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో మంత్రి కందుల దుర్గేష్ పేషీలో ఈ సమావేశం జరిగింది. మంత్రులు పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయ స్వామి, వర్చువల్‌గా పాల్గొన్నారు. సమావేశంలో విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కీలక నిర్ణయాల దిశగా చర్చలు జరిగాయి.
Read Also: LEADER : వచ్చింది రూ. 3కోట్లు…వేసుకుంది రూ. 25కోట్లు
రుషికొండలోని ఈ భవనాలను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే అవకాశాలపై కమిటీ ప్రత్యేకంగా చర్చించింది అని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్… సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం కొండపై 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు మీటర్లు, మొత్తం 4800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈ భూమిని ఎలా సమర్థవంతంగా వినియోగించాలనే అంశంపై వివిధ ప్రతిపాదనలు పరిశీలించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ భవనాలను ఉపయోగించడమే లక్ష్యంగా కమిటీ ఆలోచనలు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి హోటల్ గ్రూపులు కూడా ఈ భవనాల నిర్వహణపై ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. తాజ్, ఎట్మాస్పియర్ కోర్, లీలా, ఫెమా వంటి ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్న నేపథ్యంలో, మరిన్ని సంస్థలకు కూడా అవకాశం కల్పించే అంశంపై చర్చ జరిగింది.
ఇక గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణ, విద్యుత్ ఖర్చుల కోసం నెలకు సుమారు రూ. 25 లక్షల ప్రజా ధనం వ్యయమవుతోందని కమిటీ వెల్లడించింది. ఈ వ్యయాన్ని తగ్గిస్తూ, ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సబ్ కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించనుంది. అనంతరం ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.