ఆంధ్రప్రదేవ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైసీపీ నేతల బృందం కలిసింది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అక్రమ కేసులు, వ్యవస్థల నిర్వీర్యంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు విడదల రజినీ.. వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైసీపీ బృందం అబ్దుల్ నజీర్‌ను కలిశామని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడాలని కోరాం.. రాజ్యాంగాన్ని మీ ప్రభుత్వంలో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరామని పేర్కొన్నారు. సీఎంగా ఉండి గంగాధర నెల్లూరులో మాట్లాడిన మాటలు అందరూ చూశారు.. ఎవరైనా లబ్ధిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అర్హులైతే పథకాలు అందటం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు.
Read Also: Fish bite: చేప కాటు వల్ల ప్రాణాంతక ఇన్ఫెక్షన్.. చేయిని కోల్పోయిన రైతు..
సీఎం చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.. దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చాక ఈ రకమైన పదాలతో ఏ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడలేదని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. పార్టీ విధానాల ప్రకారం గత ముఖ్యమంత్రులు పనిచేశారు.. అధికార, ప్రతిపక్షాలు ఎవరి పాత్ర వారు పోషిస్తారన్నారు. ఇది వ్యక్తిగత వివాదాలు కాదు.. ఆస్తి తగాదాలు కాదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు ఇలా మాట్లాడటం దురదృష్టకరం అని అన్నారు. పేదవాళ్ళకు పార్టీలు అంటగట్టి మాట్లాడటం ధర్మమా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా తమ పాత్ర తాము పోషిస్తున్నామని చెప్పారు. ప్రజల కోసం తమ సిద్ధాంతాల కోసం పోరాడతామని తెలిపారు. ప్రతీరోజూ వైసీపీ కార్యకర్తలు, జర్నలిస్టులపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారు.. అన్ని విషయాలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Vangalapudi Anitha: మహిళా ఎస్సై పట్ల ఆకతాయిల దాడి.. హోంమంత్రి ఆగ్రహం