పెరిగిన ధరలతో సామాన్యులకు వెన్నులో వణుకుపుడుతుంది. పెట్రోల్, డీజీల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అగ్గిపెట్టె ధర కూడా పెరగనుంది. గత 14 ఏళ్లుగా ఒక్క రూపాయిగా ఉన్న అగ్గిపెట్టె ధర డిసెంబర్1 నుంచి రూ.2 చేయాలని తయారీ దారులు నిర్ణయించారు. దీనికి కారణం పెరిగిన ధరలేనని వారంటున్నారు.
రూ.425గా ఉన్న రెడ్‌ఫాస్పరస్ ధర రూ.810కి, రూ.58గా మైనం రూ.80కి చేరడంతో అగ్గిపెట్టె ధర కూడా పెంచక తప్పడం లేదని తయారీ దారులు అన్నారు. చివరిసారిగా 2007లో అర్ధరూపాయిగా ఉన్న అగ్గిపెట్టె ధర రూపాయికి పెరిగింది. ఏదీ ఏమైనా రోజు రోజుకు ధరలు పెరుగుదల మాత్రం ఆగడం లేదు. నిత్యావసర సరుకులతో పాటు ఇతర వస్తువులకు విపరీతమైన ధరల పెరుగుదలతో సామాన్య జనం ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను అర్ధం చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.