Sabari – Godavari Floods: మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.. శబరి – గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. దాదాపు 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి శబరి – గోదావరి నదులు.. దీంతో, కూనవరం వద్ద 47.75 అడుగులతో ప్రమాదకర స్థాయికి చేరింది గోదావరి నీటిమట్టం.. కూనవరం మండలం పంద్రాజుపల్లి వద్ద రోడ్డుపై ప్రవహిస్తోంది వరద నీరు. భాస్కర కాలనీ, గిన్నెల బజార్ లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.. దీంతో, పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు బాధితులు.. కూనవరం మండలం పోలిపాక, దూగుట్ట వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది.. దీని ప్రభావంతో చింతూరు – కూనవరం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.. ఎటపాక మండలం పోలిపాక, నందిగామ, నెల్లిపాక గ్రామాల వద్ద రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో విలీన మండలాల నుంచి భద్రాచలానికి రాకపోకలు బంద్ అయ్యాయి.. జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి వీఆర్ పురం మండలంలోని శ్రీరామగిరి, వడ్డిగూడెం, చింతరేవుపల్లి గ్రామాలు.. వరద మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో అప్రమత్తమైన అధికారులు.. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.. మొత్తంగా శబరి – గోదావరి నదుల్లో వరద పెరగడంతో 100కి పైగా గ్రామాలకు నిలిచిపోయాయి రాకపోకలు..