Top Maoist Leader Devji Killed: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండు రోజులు జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు కీలక నేతలు ప్రాణాలు విడిచారు.. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో టాప్ లీడర్ హిడ్మా సహా ఆరుగురు మృతిచెందగా.. ఈ రోజు అల్లూరి జిల్లాలో జరిగిన తాజా ఎదురుకాల్పుల్లో మావోయిస్టు టాప్ లీడర్ దేవ్‌జీ సహా ఏడుగురు మృతిచెందినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో దేవ్‌జీ మరణం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.. దండకారణ్యం అడవుల్లో పుట్టి పెరిగిన PLGA ఉద్యమం ఇప్పుడు అంతిమ దశకు చేరుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.. దేవ్‌జీ మరణం ఆ ఉద్యమానికి కోలుకోలేని దెబ్బగా పేర్కొంటున్నారు..
అసలు ఎవరు ఈ దేవ్‌జీ..?
దేవ్‌జీ అసలు పేరు తిరుపతి అలియాస్ దేవ్‌జీ.. ఆయన స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కోరుట్ల గ్రామం.. ఇంటర్ వరకు మాత్రమే చదవిన ఆయన.. 1978లో రైతు కూలీ, వెట్టి చాకిరీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.. ఆయన పీపుల్స్ వార్ పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.. నంబాల కేశవరావు తర్వాత పార్టీ కీలక బాధ్యతలు స్వీకరించారు.. అంతేకాదు, పార్టీ అంతర్గత విభేదాల్లో ప్రధాన పాత్ర పోషించారు.. సాయుధ పోరాటాన్ని తగ్గించి చర్చల మార్గంలో వెళ్లాలని కొంతమంది భావించినప్పుడు.. దానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన వారిలో ముందువరుసలో దేవ్‌జీ ఉన్నారు.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల SZC సభ్యుడిగా పనిచేసి, మావోయిస్టుల దళాలకు వ్యూహాత్మక మార్గదర్శకుడిగా నిలిచాడు దేవ్‌జీ. అయితే, ఇటీవలి రెండు రోజుల ఎన్‌కౌంటర్లలో టాప్ కమాండర్లు వరుసగా మృతిచెందడం.. మావోయిస్టుల కార్యకలాపాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ పూర్తిగా నిలిచిపోయిందని.. మిగిలిన వారిపై దాడులు కొనసాగుతాయని తెలియజేస్తున్నాయి.