AP Govt: వర్షాకాలం కావడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ఏజెన్సీ నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన ప్రాంతాల్లో వాగులు దాటి రావాల్సిన చోట నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను ముందుగా గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ అమలు కావడం లేదు అనడానికి నిదర్శనంగా ఓ ఘటన చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం బొడ్డగుంట గ్రామానికి చెందిన పల్లాల వర లక్ష్మీ పురిటి నొప్పులతో బాధ పడుతుండగా.. మారేడుమిల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని 108 కి ఫోన్ చేశారు. 108 సిబ్బంది హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.
Read Also: Chandrababu- Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు ఫోన్..
అయితే మధ్యలో వాగు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 108 వాహనంకి మార్గం లేకపోవడంతో వెళ్లడానికి వీలుపడలేదు.. ఇక, వర లక్ష్మీకి అప్పటికే పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి. 108 సిబ్బంది అతికష్టం మీద వాగు దాటి వెళ్లి గర్భిణీని మోసుకొని అంబులెన్సు దగ్గరకి తీసుకు వచ్చారు. అయితే, మార్గ మధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఘాట్ రోడ్ దగ్గర 108 సిబ్బంది పురుడు పోశారు. వరలక్ష్మీ పండంటి మగ బిడ్డని జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆ తర్వాత తల్లి బిడ్డను మారేడుమిల్లి పీహెచ్సి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే, గిరిజన ప్రాంతాలకు సరైన రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసి.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.