తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారు. 72 ఏళ్ల చంద్రబాబు తన వయస్సు గురించిన ఆందోళనలను కూడా పక్కనబెట్టి పార్టీ కోసం శ్రమిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీని గద్దె దించటమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. వీలైనంత ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉండేందుకు టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారు.
వయస్సు గురించి ప్రస్తావిస్తే.. తన వయస్సు గురించి దిగులు చెందాల్సిన పనే లేదంటారాయన. ఆ మాటకొస్తే ప్రధాని మోదీది కూడా బాబు వయస్సే. వయసు కాదు.. పనితీరు ముఖ్యం అంటారు చంద్రబాబు. 30 సంవత్సరాల యువకులు కూడా తనలా పని చేయలేరని ఆయన గట్టి నమ్మకం. గత ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన పాదయాత్రలు.. సుదీర్ఘ పర్యటనలు అందుకు ఓ ఉదాహరణ. ఆయనలో ఇప్పటికీ ఆదే ఉత్సాహం.. చురుకుదనం కనిపిస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఇప్పుడు అనేక రాజకీయ సవాళ్లు ఎదుర్కొంటోంది. వైసీపీతో పోల్చి చూస్తే టీడీపీలో యువతరం నేతల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికీ చంద్రబాబు తన తరం నేతల మీద ఆధారపడి బండి లాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలి మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారు. ‘మహానాడు’కు ముందు టీడీపీ అధినేత చాలా కసరత్తు చేశారు. కొంత కాలంగా పార్టీ క్యాడర్‌తో తరచూ వర్చువల్ సమావేశాలతో టచ్‌లో ఉన్నారు. కార్యకర్తలకు నిరంతం అందుబాటులో ఉన్నారు. ఆయన శ్రమ మహానాడులో కనిపించిందని పార్టీ వర్గాలు అంటున్నారు.
మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందనే భావనలో టీడీపీ నాయకత్వం ఉంది. రాజకీయ వర్గాలలో కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమవుతోంది. కనీసం రెండు లక్షల మంది కార్యకర్తలు అభిమానులు ఈ సభకు హాజరయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తీవ్ర నిరాశలో ఉన్న టీడీపీ శ్రేణులకు ఇది గొప్ప ఉత్సాహం ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. పార్టీ తిరిగి అధికారాన్ని దక్కించుకుంటుందన్న నమ్మకాన్ని వారిలో తప్పకుండా ఇది పెంచుతుంది.
ప్రస్తుత ఎన్నికల రాజకీయాల్లో అధికార పార్టీకైనా, విపక్షాలకైనా ఓ బలమైన ఎన్నికల నినాదం అనివార్యం. 2024 ఎన్నికల కోసం ‘క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్’ అనే స్లోగన్‌ను మహానాడు వేదికగా చంద్రబాబు నినదించారు. 2024కి సన్నద్ధతకు పిలుపుగా ఈ నినాదాన్ని చూడవచ్చు. ఇక నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళ్లి నిరంతరం వైసీపీ పాలనా వైఫల్యాలను ప్రచారం చేయాలని చంద్రబాబు కార్యకర్తలకు బోధించారు.
2019 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ దాదాపు 40 శాతం ఓట్లు సాధించింది. అయితే 175 అసెంబ్లీ స్థానాలలో కేవలం 23 సీట్లు మాత్రమే గెలవగలిగింది. మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ దాదాపు 50 శాతం ఓటింగ్‌తో 151 చోట్ల గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ ఘోర పరాజయం టీడీపీ శ్రేణులను చెల్లాచెదురు చేసింది. ఇంటిపోరు.. అంతర్గత సమస్యలతో కుదేలైన పార్టీని తిరిగి బలోపేతంచేసి ఎన్నికలకు సిద్దం చేయటం అంత సులభం కాదు. అందుకే తన వయస్సును కూడా లెక్క చేయకుండా.. విశ్రమించకుండా చంద్రబాబు పార్టీ కోసం శ్రమిస్తున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఇప్పటి నుంచే బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లి ఎన్నికల సమయానికి తమకు గెలుపు వాతావరణం సృష్టించుకోవటమనే ఏకైక ఎజెండాతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. అందుకే ఆయన నిరంతర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం దివాళా తీసిందని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. పలు ప్రజా సమస్యలు, అధిక ధరలు, రైతు బాధలను టీడీపీ ప్రధానాస్త్రాలుగా మలుచుకుంటోంది. జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయాని, ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని.. వైసీపీ నేతలు భయోత్పాతం సృష్టిస్తున్నారంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ప్రజలపై అధిక పన్నుల భారం మోపి నానా ఇబ్బందులు పెడుతున్నారంటూ ప్రజాక్షేత్రంలో నిప్పులు చెరుగుతున్నారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న వారిపైనే తిరిగి కేసులు పెడుతున్న పరిస్థితి ఉందని, రౌడీలతో కొట్టిస్తున్నారని, ఆ భయంతో ప్రజల్లో భాద, చిరాకు అసహనం పెరిగిందని టీడీపీ అంటోంది. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లటం తన బాధ్యత అంటున్నారు చంద్రబాబు. అయితే టీడీపీ ఆరోపిస్తున్నట్టు నిజంగానే క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి ఉందో లేదో తెలియదు.
అంతేకాదు.. వైఎస్ జగన్ ప్రజా సంక్షేమ పథకాల ముందు చంద్రబాబు ఆరోపణలు ఎంతవరకు పనిచేస్తాయో కూడా తెలియదు. వైసీపీ తన మూడేళ్ల పాలనలోఅనేక ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్-DBT) పథకాలు ప్రవేశపెట్టింది. తద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులు బదిలీ చేస్తోంది. ఇందుకు గానూ ప్రభుత్వం గడచిన 30 నెలలలో రూ.1.16 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తమ పట్ల ప్రజలలలో అసలు వ్యతిరేకతే లేదని వైసీపీ నాయకత్వం పూర్తి విశ్వాసంతో ఉంది.
ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా వెళుతుందా? పొత్తులు పోట్టుకుంటుందా అనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. పొత్తుల అంశంపై మహానాడులో సిగ్నల్ ఇస్తారని చాలా మంది బావించారు. కానీ ఆ అంశం ప్రస్తావనకే రాలేదు. ఎన్నికలకు ఇంకో రెండేళ్ల సమయం ఉన్నందున బహుశా దాని గురించి ఇప్పుడే ఎందుకు చర్చ అని బావించి ఉండవచ్చు. పైగా ఇప్పుడు పొత్తులన ప్రస్తావన తీసుకువస్తే ప్రజల ఆలోచనలు ప్రభుత్వ వైఫల్యాల నుంచి పక్కకు జరిగి పొత్తుల మీదకు వెళుతుంది. ఇప్పటికిప్పుడు టీడీపీ టార్గెట్ వీలైనంత ఎక్కువగా ప్రజలలలో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చేలా చేయటం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సందేశాన్ని బలంగా వినిపించటం. అలాగే ప్రజాక్షేత్రంలో టీడీపీ విశ్వసనీయతను పెంచటం. ఇవి బాబు తక్షణ లక్ష్యాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.