భారీ వర్షాలతో ఏపీ తడిసిముద్దయింది. ఇప్పటికే భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వరదతో రోడ్లు, రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. అయితే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 1800 ఆర్టీసీ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. కడపలో పర్యటించిన ద్వారక తిరుమలరావు బస్టాండ్, గ్యారేజ్‌ను పరిశీలించారు. కడప, రాజంపేట మీదుగా తిరుపతికి ఈ రోజు సర్వీసులు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
నిన్న రాజంపేట వరదలో ఆర్టీసీ బస్సులో ముగ్గురు మృతి చెందడం బాధాకరమన్నారు. బస్సులో చనిపోయిన కండక్టర్ కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం అందజేస్తామన్నారు. మరో ఇద్దరు ప్రయాణికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. కడప ఆర్టీసీ గ్యారేజ్ అభివృద్ధికి త్వరలోనే 10కోట్లతో పనులు ప్రారంభిస్తామన్నారు.