ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల వివాదంపై ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నాడు సినిమా టిక్కెట్ల ధరల సమస్యలపై సచివాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్, ఇతర సభ్యులు హాజరయ్యారు. అనంతరం స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఏపీలోని థియేటర్లలో శుక్రవారం నుంచి 100 శాతం ఆక్యుపెన్సీ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. అయితే ప్రేక్షకులు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు.
అటు టిక్కెట్ రేట్లపై అన్ని అంశాలు చర్చించామని.. టిక్కెట్ రేట్ల విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ అడిగిన వాటికి 99 శాతం ప్రభుత్వం అనుకూలంగా ఉందని స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు స్లాబుల్లో టికెట్ల ధరలు ఉండనున్నట్లు చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు. ఫిల్మ్ ఛాంబర్‌తో చర్చించి తాము రేట్లను ప్రభుత్వానికి సూచించామన్నారు. అతి త్వరలోనే ఈ విషయంపై ఫైనల్ నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు.