AP Crime: బంగారం అంటే మనకు అసలే పిచ్చి.. భారీ డిమాండ్‌తో ఇప్పటికే తులం బంగారం ధర లక్ష దాటేసింది.. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర అవసరాలకు కొనేవారు కొంటూనే ఉన్నారు.. ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. పార్వతీపురం మన్యం జిల్లాలో సగం ధరకే బంగారం అంటూ ఘరానా మోసం చేశారు. 12 లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు కేటుగాళ్లు.. దీంతో, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతానికి చెందిన బాధితురాలు శ్రీలక్ష్మి లబోదిమోమంటోంది..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
గత నెలలో శ్రీలక్ష్మిని సగంధరకే బంగారం ఇప్పిస్తానంటూ నమ్మించాడు రిషి అనే వ్యక్తి.. ఈ మేరకు పావు కిలో బంగారం కోసం రూ. 12 లక్షలకు ఒప్పందం కుదిరింది.. ఈ క్రమంలో 12 లక్షల రూపాయల నగదును సిద్ధం చేసింది శ్రీలక్ష్మి.. ఇక, సగం ధరకే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై రిషి అనే వ్యక్తితో పాలకొండకు వెళ్లింది శ్రీలక్ష్మి. పాలకొండ నుంచి పార్వతిపురం వైపు బంగారం చూపిస్తామని తీసుకెళ్లారు కేటుగాళ్లు.. పార్వతీపురం పట్టణ శివారులో మాట్లాడుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు దుండగులు.. మహిళ ముఖంపై పౌడర్ జల్లి 12 లక్షల క్యాష్‌తో ఉడాయించారు.. దీంతో, పార్వతీపురం గ్రామీణ పోలీసులను సంప్రదించి జరిగిన మోసాన్ని వివరించారు బాధిత మహిళ శ్రీలక్ష్మి.. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిషి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు..