ప్రధాన మంత్రితో పోల్చితే రాష్ట్రపతి ఎన్నిక పెద్దగా ఉత్కంఠ రేపదు. అలాంటి ఉత్కంఠ భరిత వాతారణం ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది. 1969, 1997 రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మాత్రమే దేశం అలాంటి ఉత్కంఠను చూసింది. చాలా ఏళ్ల తరువాత ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు పోటా పోటీగా జరగనున్నాయి. అధికార ఎన్‌డీఏ కూటమికి సంఖ్యాబలం కాస్త తక్కువగా ఉండటమే ఈ ఉత్కంఠకు కారణం అని చెప్పవచ్చు. 2017ఎన్నికల మాదిరిగా ఈసారి అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడక కాదు. ప్రతిపక్షాలు బలమైన ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనుండటంతో భారత ఎన్నికల సంఘం నూతన రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించింది. దాంతో, అధికార, విపక్ష పార్టీల మధ్య మరోసారి యుద్ధభేరీ మోగినట్టయింది. రాష్ట్రపతి పదవికి పోటీచేసే ఎన్డీయే అభ్యర్థికి ప్రస్తుతం పూర్తి మెజారిటీ లేదు. ఈ పరిస్థితిని విపక్షాలు క్యాష్ చేసుకోవాలనుకోవటం సహజం. ఐతే, బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకతాటిపైకి రావాల్సి ఉంది. అందువల్ల ప్రతిపక్షాలు ఎంతవరకు ఐక్యంగా ఉంటాయో ఈ ఎన్నికల ద్వారా తేలిపోతుంది.
షెడ్యూల్ ప్రకారం జూన్ 15న నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూలై 18న పోలింగ్, జూలై 21న కౌంటింగ్ జరుగుతుంది. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో జూన్ 15న నోటిఫికేషన్ రాగా, జూన్ 19న ఎన్డీయే రామ్ నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. సంఘ్ పరివార్ నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆయన. కానీ ఈసారి బీజేపీ తన అభ్యర్థి విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అభ్యర్థుల ఎంపిక పట్ల మోడీ-షా గోప్యత ప్రదర్శిస్తారని పార్టీలో అందరికి తెలుసు. పార్టీ భవిష్యత్ ప్రయోజనాల మేరకే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కూడా అలాంటి కసరత్తు జరుగుతోంది.
ఉత్తరాధి పార్టీ అనే విమర్శలు మూటగట్టుకున్న ఆ పార్టీ ఈ సారి దక్షిణాదికి చెందిన వారిని బరిలో నిలిపే అవకాశాలున్నాయి. ఆ ప్రాంతంపై తాము మరింత దృష్టి సారిస్తున్నామని దీని ద్వారా సంకేతం ఇవ్వాలని బావిస్తోంది. జులై 1న హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమయ్యే సమయానికి తమ అభ్యర్థి పేరు వెలువడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు రేసులో ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా ఆయనకు మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది.
తమిళనాడు, తెలంగాణ నుండి ఒకరిని రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని బీజేపీ నిర్ణయించుకుంటే దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీలు వారికి మద్దతు ఇవ్వవలసి వస్తుంది. ప్రస్తుత తెలంగాణ గవర్నర్, తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ తమిళిసై సౌందరరాజన్ పేరు కూడా ప్రచారంలో ఉంది. మరోవైపు, భారతదేశానికి ఇప్పటి వరకు ఒక గిరిజన నేత రాష్ట్రపతి కాలేదు. ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసూయ ఉయికే, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము కూడా రేసులో ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరిని ఈ అత్యున్నత రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టి ఆ లోటు తీర్చే అవకాశం ఉంది.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయనను రాష్ట్రపతి చేయటం ద్వారా తాము దళితులకు దగ్గర అనే సందేశాన్ని సంఘ్ పరివార్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి దళిత నేతకు అవకాశం ఇచ్చినా ఇవ్వచ్చు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఇటీవల ప్రధాని మోడీని కలిశారు. ఆయన కూడా దళితుడు కావడం గమనార్హం.
మరోవైపు, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేరు కూడా ప్రచారంలో ఉంది. సెక్యులర్ పార్టీలకు చెక్ పెట్టేందుకు ఆయనకు అవకాశం ఇచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇక, బీజేపీకి చెందిన ముస్లిం ఎంపీలు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఎమ్.జె. అక్బర్, సయ్యద్ జాఫర్ రాజ్యసభ సభ పదవీకాలం త్వరలో ముగియనుంది. దాంతో ఆ పార్టీకి పార్లమెంటు ఉభయసభల్లో ముస్లిం ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. కనుక, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న నఖ్వీని ఆ పదవికి పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. అయితే, ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే అనే విషయం మరిచిపోవద్దు.
ఈ అత్యున్నత రాజ్యాంగ పదవికి గవర్నర్, వైస్ ప్రెసిడెంట్ , సీనియర్ మంత్రిని ఎంపికచేయటం సంప్రదాయంగా వస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఓబీసీ, గిరిజనుల వర్గాల నుంచి రాష్ట్రపతి కాలేదు. 2017లో కూడా ముర్ము పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆమెను గవర్నర్‌గా నియమించారు.
2017 ప్రెసిడెంట్, వైస్‌ప్రెసిడెంట్ అభ్యర్థులు ఇద్దరూ బీజేపీ సైద్ధాంతిక నేపథ్యం నుంచి వచ్చినవారు. భారత రాజకీయాలలో అలా జరగటం అదే మొదటిసారి. అయితే, బీజేపీ పరిస్థితి ఇప్పుడు అప్పటిలా లేదు. ప్రస్తుతం కొన్ని మిత్రపక్షాలను రాష్ట్రాలను కోల్పోయింది. కానీ, ఇటీవల ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ , గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు రాష్ట్రపతి ఎన్నికల పట్ల దానికి ఉన్న భయాలను తొలగించింది.
2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలుచుకోగా, 2022లో దాని సంఖ్య 255కు తగ్గింది. ఐతే, 2017 నాటి కన్నా ఇప్పుడు ఆ పార్టీకి లోక్‌సభ, రాజ్యసభలో బలం పెరిగింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో 4,896 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4,120 మంది ఎమ్మెల్యేలు , 543 లోక్‌సభ, 233 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా ప్రతి ఎలక్టర్‌కు ఓటు విలువ కేటాయించబడుతుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు ఓటు విలువ 708 కాగా, వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలకు భిన్నంగా ఉంటుంది.
రాష్ట్ర అసెంబ్లీలలో ప్రస్తుత బలం ప్రకారం ఈసారి రాష్ట్రపతి ఎన్నికలకు దేశంలోని ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 5,43,231 అని ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే పార్లమెంటులో బలం ప్రకారం ఎంపీల మొత్తం ఓట్ల విలువ 5,43,200. 2022 అధ్యక్ష ఎన్నికలల్లో ఓటర్ల మొత్తం ఓటు విలువ 10,86,431. ఒక అభ్యర్థి ఎన్నిక కావాలంటే వారికి కనీసం 50 శాతానికి పైగా ఓట్లు రావాలి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించాలంటే వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీలో ఒకరి మద్దతు అవసరం. ఎన్డీయేతర పాలిత రాష్ట్రాల నుంచి బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేస్తే ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రాంతీయ పార్టీలపై ఒత్తిడి వస్తుంది. కనుక, దక్షిణాది వారి వైపే బీజేపీ పెద్దలు మొగ్గుచూపవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, ప్రతిపక్ష శిబిరం ఇంకా ఒకే వేదికపైకి రాలేదు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ, శివసేన, ఎన్సీపీతో పాటు టీఆర్‌ఎస్ పార్టీలు కాంగ్రెస్‌తో కలిస్తే ఒక విశ్వసనీయమైన ప్రతిపక్షాన్ని నిర్మించవచ్చు. కానీ అవి ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నం ఇంకా ఏదీ జరుగుతున్నట్టు లేదు. బహుశా, బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం కావచ్చు. 2024లో మోడీని బలంగా సవాలు చేయాలంటే ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏను ఎదుర్కోవడానికి బలమైన ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించటం వాటికి చాలా కీలకం.