అది పేరుకేమో మహానగరం.. తెలంగాణ కీర్తి కీరిటానికి బ్రాండ్ అంబాసిడర్.. అన్ని మతాలు, కులాలకు కేరాఫ్.. మినీ భారతదేశంగా పేరుగాంచిన హైదరాబాద్ ఒక్క చిన్నవానకే అతలాకుతలం అవడం ఏమిటీ? అన్న ప్రశ్న ప్రతీఒక్కరి మనస్సులో మొదలుతోంది. వేల కోట్ల రూపాయాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని డబ్బాలు కొట్టుకునే పాలకులు ప్రస్తుత దుస్థితికి ఎవరు బాధ్యత తీసుకుంటారనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. గత పాలకుల తప్పిదమని ఒకరంటే ఇప్పుడున్న పాలకులదే తప్పని మరొకరు.. ఇలా విమర్శలు చేసుకుంటూ తప్పించుకుంటున్నారు. అంతేగానీ సగటు హైదరాబాద్ వాసి ఆవేదనను పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
నిజాంలో కాలంలోనే హైదరాబాద్ నగరాన్ని పక్కా ప్రణాళికలతో రూపొందించారు. చరిత్రలో నిలిచిపోయిన ఈ నగరాన్ని నాటి నిజాం రాజులు అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో నిర్మించారు. చక్కటి డ్రైనేజీ వ్యవస్థ.. గొలుసుకట్టు చెరువులు, నాలాలను ఏర్పాటు చేశారు. వారి కృషి వల్ల నాడు హైదరాబాద్ ‘సిటీ ఆఫ్ లేక్’ గా గుర్తింపు తెచ్చుకుంది. 1965 నాటి శాటిలైట్ చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. అయితే అప్పటికి ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి చాలా తేడాలొచ్చాయి. సహజ వనరులతో అలరిన హైదరాబాద్ నేడు కంక్రీట్ జంగల్ ను తలపిస్తోంది.
కార్పొటీకరణలో, అభివృద్ధిలో హైదరాబాద్ మిగతా నగరాలతో పోటీ పడుతోంది. అయితే డ్రైనేజీ సిస్టంలో మాత్రం మిగతా నగరాల కంటే ఎంతో వెనుకబడి ఉన్నది మాత్రం అక్షరసత్యం. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వాన కురిస్తే చాలు ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది. రోడ్లపైకి వరదనీరు చేరి జలాశయాలను తలపిస్తుంటాయి. ఇక లోతట్టు ప్రాంతాలైతే కొన్నిరోజులపాటు నీళ్లలోనే ఉన్న సంఘటనలు ఇటీవల అనేకం ఉన్నాయి.
వీటిన్నింటికీ పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కన్పిస్తుంది. హైదరాబాద్లోని చెరువులు, నాలాలను కబ్జాకోరులు ఆక్రమిస్తున్నా జీహెచ్ఎంసీగానీ, ప్రభుత్వ పెద్దలుగానీ చర్యలు తీసుకోకపోవడమే ఈ దుస్థితికి కారణమని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు నగరం చుట్టురా ఉన్న గొలుసుకట్టు చెరువులు వాటికి అనుసంధానంగా కాలువలు, నాలాలు ఉండేవని.. ఇప్పుడు అవేమీ కన్పించడం లేదని అంటున్నారు. దీనికితోడు నాలాలను ఆక్రమించి యథేచ్ఛగా బిల్డింగులను నిర్మించడం, రోడ్ల పక్కన సైడ్ కాల్వలు లాంటి ఏర్పాటు చేయకపోవడం వల్ల వర్షం వచ్చిన ప్రతీసారి నగరం నీట మునిగిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిన్నపాటి వానలకే నగరం తడిసిముద్దవుతూ జలాశయాలను తలపిస్తోంది.. లోతట్టు ప్రాంతాలు నీటిమునిగిపోతున్నాయి. వర్షం వచ్చిన ప్రతీసారి లోతట్టు ప్రాంతావాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటారు. ఒక్కోసారి నాలుగైదు రోజులపాటు నీళ్లల్లోనే ఉన్న సంఘటనలు ఉన్నాయి. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు సైతం నగరం వరదల్లో మునిగిపోయింది. అయినప్పటికీ పాలకులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది మాత్రం అంతుచిక్కడం లేదు.
గత రెండ్రోజులుగా నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం మరోసారి వరదకు గురైంది. చాలా ప్రాంతాలు నీళ్లలోనే ఉన్నాయి. దీంతో ఆ ఏరియాల్లోని ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇళ్లలోకి మురికినీరు చేరడంతో ఎక్కడి వెళ్లాలో.. ఎవరికీ చెప్పుకోవాలో తెలియక నానా బాధలు పడుతున్నారు. వరదలు వచ్చినప్పుడల్లా నాయకులు వచ్చి పరామర్శించి వెళ్లిపోతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేక పోతున్నారు. దీంతో నగరంలో వర్షం వచ్చిన ప్రతీసారి ఇలాంటి సంఘటనలు తరుచూ కన్పిస్తున్నాయి.
పాలకుల నిర్లక్ష్యానికి తోడు మనిషి తన స్వార్థంతో చేస్తున్న తప్పుల కారణంగా ఇలాంటి విపత్తులు వస్తున్నాయి. అడవులు నరికివేత..చెరువులు, కాల్వల ఆక్రమణలతో విపత్తులు వస్తున్నాయి. ప్రకృతి సంపదను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన మనిషి కేవలం తన స్వార్థ ప్రయోజనాలకే వాడేయడంతో ప్రకృతి ప్రకోపాలకు గురవుతున్నారు. వాతావరణ మార్పులు శరవేగంగా జరుగుతూ మనిషి వినాశానికి దారితీస్తున్నాయి. సమయానుకూలంగా రావాల్సిన రుతుపవనాలు గతి తప్పిపోతున్నాయి. ఎండకాలంలో వానలు.. వానకాలంలో ఎండలు వస్తున్నాయి. అందుకే కరోనా వంటి మహమ్మారులు పుట్టుకొచ్చి మళ్లీ ప్రకృతిని సెట్ రైట్ చేస్తున్నాయి. ప్రకృతిని పరిశుభ్రం చేస్తున్నాయి.
ఏ విపత్తుకైనా కూడా మనిషి స్వార్థ ప్రయోజనాలే కారణం అని చెప్పకతప్పదు. ఏదిఏమైనా మహానగరంగా పేరున్న హైదరాబాద్ ఇప్పుడు మునిగిందంటే కారణం పాలకులు, ప్రజాప్రతినిధులు.. ప్రజలే.. అన్నింటిని కబ్జా చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఈ మురికికూపం నుంచి బయటపడేయాల్సిన బాధ్యత పాలకులతోపాటు ప్రజలపైనే ఉంది. సమష్టి కృషి చేస్తేనే హైదరాబాద్ నగరం తిరిగి పూర్వవైభవం సంపాదించుకుంటుంది. లేదంటే మాత్రం ఇలాంటి సంఘటనలు మున్ముందు మరిన్ని చూడక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.