పొలిటికల్ సర్కిల్స్ లో ప్రశాంత్ కిషోర్(పీకే) గురించి తెలియని వారుండరు. రాజకీయ వ్యూహకర్తగా పీకేకు మంచి పేరుంది. ఏ పార్టీకైనా ఆయన వ్యూహాకర్తగా పని చేస్తున్నారంటే ఆపార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఆయన ఎంట్రీతోనే ఆపార్టీ సగం గెలిచినట్టే భావన కలుగుతుంది. దీంతో పీకేకు దేశంలో ఎక్కడ లేని డిమాండ్ వచ్చిపడింది. ఆయన ట్రాక్ రికార్డు కూడా అలాగే ఉంది. దీంతో పీకేను పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పెట్టుకునేందుకు ప్రాంతాలకు అతీతంగా ఆయా పార్టీలు ముందుకొస్తున్నాయి.
పీకే పని చేసిన పొలికల్ పార్టీలు దాదాపుగా అధికారంలోకి రావడం ఇటీవల కామన్ అయిపోయింది. ఒకటి రెండు రాష్ట్రాల్లో మినహా పీకే టీం పనిచేసిన ప్రతీచోట ఆపార్టీనే అధికారంలోకి వచ్చింది. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున పీకే రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. అలాగే ఢిల్లీ, పశ్చిమెంగాల్, తమిళనాడులోనూ పీకే హవానే కొనసాగింది. పీకే స్ట్రాటజీస్ కు తోడు అధినేతల ఇమేజ్ కలిసి రావడంతో ఘన విజయాలు సాధించి పార్టీలే అధికారంలోకి వచ్చాయి.
పట్టిన పార్టీలకల్లా విజయాలు కట్టబెడుతున్న పీకే పేరు మార్మోగిపోతోంది. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ క్యాబినేట్ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. మంత్రులంతా ఎన్నికల మూడ్ లోకి వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పీకే టీం త్వరలోనే ఏపీలో ఎంట్రీ ఇస్తుందని వారితో కలిసి పని చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు వార్తలు విన్పించాయి.
సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి పీకే టీం సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీలు హడలిపోతున్నాయి. గత ఎన్నికల్లో పీకే వ్యూహాలకు తోడు జగన్ ఇమేజ్ తోడవడంతో ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. ఈమేరకు మరోసారి వారికి పీకే భయం పట్టుకుంది. పైకి మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్న ప్రతిపక్ష నేతలు పీకేను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ కు పీకేలు అవసరమని, చంద్రబాబు మాత్రం తన సొంత వ్యూహాలతోనే పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని ఎదురుదాడికి దిగుతున్నారు.
మీడియా సైతం ఇప్పుడు ఇదే విషయాన్ని హైలెట్ చేస్తోంది. 40 ఇయర్స్ చంద్రబాబుకు పీకేలు అవసరం లేదని స్పష్టం చేస్తోంది. ఎందరు పీకేలు వచ్చినా ఈసారి వైసీపీని టీడీపీ నిలువరిస్తుందంటూ సవాల్ విసురుతున్నారు. అయితే లోలోపల మాత్రం పీకే జ్వరం ఆపార్టీ నేతలను వదలడం లేదని తెలుస్తోంది. మరోవైపు పీకే టీం ఎలాంటి సర్వేలు నిర్వహించి తమకు టికెట్ లేకుండా చేస్తుందోననే భయం వైసీపీ నేతలు సైతం వ్యక్తం చేస్తున్నారు. పీకే ఎంట్రీకి ముందే పార్టీల నేతల్లో కలవరపాటు మొదలైంది. దీంతో ఆయన నేరుగా ఎంట్రీ ఇస్తే ఆ కిక్కే వేరప్పా అని రాజకీయవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.