పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతోంది. పాలక రాజపక్స కుటుంబంపై ప్రజలు తిరుగుబాటు కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక దుస్థితికి రాజపక్సలే కారణం అంటూ గత కొన్ని నెలలుగా లంక ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు.
నిరుద్యోగం, అధిక ధరలు, విద్యుత్ కోతలు, ఇందన కొరత, నిత్యావసరాల లేమితో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న ప్రజలు ఒక్కసారిగా పాలకవర్గం మీద తిరగబడ్డారు. వీధుల్లోకి వచ్చి నిరసనల ప్రదర్శనలు చేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈ ఆందోళనలలో పాల్పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. సర్కార్ ఆఫీసులు ఆగ్నికి ఆహుతయ్యాయి. ఈ పరిస్థితిని ఊహించిన పాలకులు ముందు జాగ్రత్తగా దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు. దాంతో ప్రజలు మరింతగా రెచ్చిపోయారు. ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పాలకులపై విరుచుకుపడ్డారు.
పోలీసులు, సైన్యాన్ని రంగంలోకి దించినా నిరసనలు ఆగలేదు. ప్రజల కోపం చల్లారలేదు. దాంతో పలు మార్లు ఎమర్జెన్సీని విధించి ఎత్తేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆందోళనలు పతాక స్థాయికి చేరాయి. రాజపక్సలు పదువుల నుంచి దిగిపోవాలని ప్రజలు మరింత గట్టిగా నినదించారు. దాంతో, మహింద రాజపక్ష మద్దతుదారులు దాడులకు దిగటంతో నిరసనకారుల్లో కోపం కట్టలు తెంచుకుంది. రాజపక్ష కుటుంబానికి చెందిన ఇళ్లతో పాటు ఎంపీల నివాసాలకు నిప్పు అంటించారు. అధ్యక్ష భవనం చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా నిప్పు పెట్టారు. దాంతో అధికార పక్ష నేతలు ఇతర ప్రాంతాకు పలాయనం చిత్తగించినట్టు వార్తలు వచ్చాయి.
మరోవైపు, సోమవారం అల్లర్ల సందర్భంగా జరిగిన కాల్పులలో తొమ్మిది మంది పౌరులు చనిపోయారు. మరో రెండు వందల మంది గాయపడ్డారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స తక్షణం పదవి నుంచి వైదొలగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఐతే,
పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కార్యనిర్వాహక అధ్యక్ష వ్యవస్థ రద్దుకు సిద్ధంగా ఉన్నానని గోటాబయ చెప్పారు. అయినా ప్రజలు వినిపించుకునే స్థితిలో లేరు. నిరసనలు మరింత హింసాత్మకంగా అల్లర్ల రూపం దాల్చుతున్నాయి. దాంతో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు, హింసను నివారించేందుకు రక్షణ శాఖ కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసింది. ఆందోళనకారులను అదుపుచేయడమే లక్ష్యంగా సైన్యం, పోలీసులకు అత్యవసర అధికారాలిచ్చారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ దోపిడీలు, దాడులు ఆగలేదు. నిరసనకారులు దుకాణాల్లో చొరబడి దోచుకుపోతున్నారు. మహింద రాజపక్స కుమారుడి రిసార్టుపైనా దాడులు జరిగాయి. నిరసనల నడుమ పదవికి రాజీనామ చేసిన ప్రధాని మహింద రాజపక్స ప్రస్తుతం నావికా దళానికి చెందిన ఓ రహస్య స్థావరంలో తలదాచుకున్నారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థావరం వెలుపల ప్రజలు ఆందోళన చేస్తున్నారు.
మరోవైపు దేశంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన ను తొలగించేందుకు దేశాధ్యక్షుడు గోటాబయ రాజపక్స ప్రయత్నాలు ఫలించాయి. కొత్త ప్రధాని నియామకంపై అధ్యక్షుడు గొటబయా రాజపక్సా రాజకీయ పక్షాలతో చర్చలు విజయవంతమయ్యాయి. యూనైటెడ్ నేషనల్ పార్టీ -యూఎన్‌పీ నేత రణిల్ విక్రమసింఘే గురువారం ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.
నిజానికి శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ విధానాలు..పాలకుల తప్పిదాలతో పాటు పరిస్థితులు కూడా కారణమే. విదేశీ రుణం భారీగా పేరుకుపోవడం, ప్రభుత్వ ఆదాయం పడిపోయి ద్రవ్య లోటు పెరిగిపోవడం, విదేశీ రుణ భారం, కరోనా వల్ల టూరిజం దెబ్బ తిని విదేశీ మారక ద్రవ్యం రాబడి తగ్గిపోవటం, శ్రీలంక కరెన్సీ పతనం, విదేశీ మారకపు నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడం వంటివన్నీ కలిసి శ్రీలంకను ఆర్థికంగా చంపేశాయి. కనుక, శ్రీలంక ప్రస్తుత దుస్థితికి బాధ్యత ఎవరంటే చెప్పటం కష్టమే. కానీ రాజపక్స ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి తీరాల్సిందే. ఎందుకంటే, భిన్నసంస్కృతుల ప్రజాస్వామ్య దేశాన్ని అధ్యక్షుడు గోటబయ రాజపక్స కుటుంబ ఆస్తిగా మార్చాడు. తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు జనం మధ్య చీలిక తెచ్చాడు. మైనారిటీలను వేధించాడు. మెజారిటీ సింహళీయుల ఓట్లు వస్తే చాలనుకున్నాడు. కానీ ఆర్థిక సంక్షోభంతో మొత్తం సీన్స్ రివర్స్ అయింది. ప్రజలంతా ఏకమై రాజపక్సల పనిపడుతున్నారు