తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో భారీగా మెపిడ్రెన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రూ. రెండు కోట్ల విలువగల డ్రగ్ స్వాధీనం చేసుకోవడంతో నగరం ఉలిక్కిపడింది. 4.92 కేజిలతో పాటు, ఓ కార్ సీజ్ చేశారు పోలీసులు. ముగ్గురు నిందితులు పవన్,మహేష్ రెడ్డి,రామకృష్ణగౌడ్ ను అరెస్ట్ చేశారు.
వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితులు ఎస్క్ రెడ్డి, హన్మంత్ రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కూకట్ పల్లిలో పవన్ వద్ద 4 గ్రాముల మెపిడ్రెన్ డ్రగ్ పట్టుకోగా అతడిని విచారించగా డొంకంతా కదిలింది. మేడ్చల్ వద్ద కన్నా మహేశ్వరెడ్డి వద్ద 926గ్రాములు పట్టుకున్నారు. అతడిని విచారించగా నాగర్ కర్నూల్ వద్ద రామకృష్ణ గౌడ్ వద్ద కారులో 4కేజీల మెపిడ్రెన్ డ్రగ్ ప్యాకెట్ దొరికింది. విద్యార్థులకు సప్లై చేయడానికి తీసుకువచ్చినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య తెలిపారు.
గుజరాత్‌లోని ముంద్రాపోర్టులో ఇటీవల వేలాది కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు నౌకల ద్వారా రూ.21వేల కోట్ల విలువైన 3వేల కిలోల డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నార్కోటిక్స్ వ్యవహారంలో విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తంకావడంతో కేంద్రం ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి మాదక ద్రవ్యాల దిగుమతి, ఉగ్రవాద మూలాలపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. దక్షిణ భారతదేశంలోనూ ఎన్ఐఏ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 15న ముంద్రా నౌకాశ్రయంలో భారీగా హెరాయిన్‌ను పట్టుకున్నారు. అయితే దీని వెనుక తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్ సూత్రధారిగా ఉన్నారు. అయితే.. అసలు సూత్రధారి మాత్రం ఢిల్లీ చెందిన వ్యక్తి అని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
ఆఫ్ఘన్ నుంచి ఇరాన్ మీదుగా.. విజయవాడ ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ఈ మాదక ద్రవ్యాలు ముంద్రా పోర్టుకు వచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసుల సోదాల్లో భారీగా గంజాయి కూడా నగరంలో పట్టుబడింది.డ్రగ్ పెడ్లర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టుబడడంతో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఏటా డిసెంబర్31 వేడుకల కోసం భారీగా విదేశాల నుంచి డ్రగ్స్ రవాణా అవుతుంటాయి. పోలీసుల దాడుల్లో గోరంత దొరికితే.. పబ్‌ల్లో మాత్రం భారీగా డ్రగ్స్ యువతకు చేరిపోతాయి. పోలీసులు దాడులు పెంచితే మరింతగా డ్రగ్స్ దొరుకుతాయంటున్నారు. తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా డ్రగ్స్ మూలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.