త్వరలోనే హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరుగనుంది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఎన్నిక మారింది. దీంతో ఎవరికీవారు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లురుతున్నారు. ఈటల రాజేందర్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతుండగా టీఆర్ఎస్ నుంచి యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నాడు. కాంగ్రెస్ పోటీలో నిలిచినా అది రెండో, మూడో ప్లేస్ కోసమనే అర్థమవుతోంది. దీంతో పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యేనని స్పష్టమవుతోంది.
టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కొత్తేమీకాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆపార్టీ నాయకులు ఎన్నోసార్లు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు తీసుకొచ్చి గెలిచిన సందర్బాలున్నాయి. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సత్తాచాటుతూ వస్తోంది. ఇదే క్రమంలోనే ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికను సైతం ఛాలెంజ్ తీసుకుంది. మరోసారి ఈ ప్రాంతంలో గులాబీ జెండా ఎగుర వేయాలని భావిస్తుంది.
హుజూరాబాద్ లో బీజేపీకి బలమైన అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఉన్నారు. బీసీ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. దీంతో ఈ వర్గం ఓట్లపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ప్రధానంగా సానుభూతి మీదే ఆయన గెలుపొటములు ఆధారపడి ఉన్నాయి. తొలినాళ్లలో ఈటల రాజేందర్ సభలు, సమావేశాలకు ప్రజల నుంచి భారీ మద్దతు వచ్చింది. అయితే ఎన్నిక ఆలస్యమవుతున్నా కొద్ది ఈటలకు ఎదురుగాలి వీస్తున్నట్లు కన్పిస్తోంది.
మరోవైపు ఈటలకు చెక్ పెట్టేలా సీఎం కేసీఆర్ పక్కావ్యూహంతో ముందుకెళుతున్నారు. ఈటలకు గంపగుత్తగా వెళ్లకుండా టీఆర్ఎస్ సైతం బీసీ అభ్యర్థినే బరిలో దింపింది. అదేవిధంగా దళితబంధు పథకాన్ని హుజూరాబాద్లో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద దాదాపు 17వేల మంది అర్హులను ప్రభుత్వం గుర్తించింది. దీని ద్వారా టీఆర్ఎస్ కు దాదాపు 35వేల ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తుంది.
దీనికితోడు టీఆర్ఎస్ పథకాలతో లబ్ధిపొందిన ఓటర్లు సైతం ఆపార్టీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీనే మరో రెండున్నేళ్లు అధికారంలో ఉండనుంది. దీంతో నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న పార్టీ వల్లనే సాధ్యమవుతుందని టీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ కు బలమైన అంశాలుగా మారుతుండగా ఈటల కేవలం సానుభూతి మీదనే ఆధారపడాల్సి వస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రస్తుతం వాయిదా పడిన నేపథ్యంలో ఓటర్లు సైతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీపావళి తర్వాత ఉప ఎన్నిక తేది ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో అప్పటివరకు ఈటల తన అనచరులను కాపాడుకోవడం కూడా కష్టమేననే టాక్ విన్పిస్తుంది. దీంతో ఎటూచూసిన ఈటల రాజేందర్ కు ఉప ఎన్నికలో ఎదురుగాలి తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఈ ఉప ఎన్నికలో గెలుపు ఈటల రాజేందర్ కు అంత ఈజీ కాదనేది మాత్రం స్పష్టమవుతోంది.