మనుషులే ఇంకా పూర్తిగా టాయ్‌లెట్స్ వాడట్లేదు..అలాంటిది మూగజీవాలు మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నాయి. వినటానికి ఇది కాస్త విడ్డూరంగానూ ఉంది. కానీ నిజం. అవి టాయ్‌లెట్లలో మూత్రం పోసేలా శాస్త్రవేత్తలు ట్రెయినింగ్ ఇచ్చారు. ఇప్పుడు అవి మరుగుదొడ్డిలో మూత్ర పోస్తున్నాయి.
ఓ అధ్యయంలో భాగంగా జర్మనీ శాస్త్రవేత్తలు అవులకు ఈ ట్రెయినింగ్ ఇచ్చారు. ఆవు మూత్రంలోని అమ్మోనియా మట్టితో కలిస్తే నైట్రస్ ఆక్సైడ్‌గా మారుతుంది. నైట్రస్ ఆక్సైడ్ గ్రీన్‌హౌస్ వాయువు. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో 10శాతం పశువుల నుంచే వస్తుంది.
రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫార్మ్ యానిమల్ బయాలజీకి చెందిన ఫార్మ్‌లో పరిశోధకులు 16 ఆవులకు మరుగుదొడ్డిని ఉపయోగించడం నేర్పించారు. ఈ టాయ్‌లెట్ పేరు “మూలూ”. ఇది ఒక దొడ్డిలాంటిది. మొదట వాటిని ఈ దొడ్డిలో ఉంచారు. అక్కడ మూత్ర విసర్జన చేసిన ప్రతిసారీ వాటికి బహుమతిగా మేత ఇచ్చారు. తర్వాత దొడ్డి పక్కన ఉన్న ప్రాంతంలో ఆవులను ఉంచారు. మరుగుదొడ్డిలోకి వెళ్లి మూత్ర విసర్జన చేసినందుకు మళ్లీ మేత ఇచ్చారు. ఇక మూలూ దొడ్డి బయట మూత్రం పోసిన ఆవులకు మాత్రం పనిష్‌మెంట్ కింద కొద్ది సేపు వాటిపై నీళ్లు చల్లారు. శిక్షణ మూడవ దశలో భాగంగా, టాయిలెట్ నుంచి దూరాన్ని పెంచారు. అలా చేయటం వల్ల ఆవులకు విషయం అర్థమైంది.
పది ట్రెయినింగ్ సెషన్స్ పూర్తయ్యే సమయానికి 11 ఆవులు సక్సెస్‌ఫుల్‌గా శిక్షణ పొందినట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రతి రోజు సగటున 15 నుంచి 20 సార్లు ఆవులు మూత్రం పోస్తాయి. అలా ప్రతి సారి అవి టాయ్‌లెట్‌కి వెళ్లి మూత్రాన్ని విసర్జించాయి. అలా మూడో వంతు ఆవులు మూడొంతుల మూత్రాన్ని మరుగుదొడ్డిలోనే పోశాయి. ఇలా 80శాతం పశువుల మూత్రాన్ని టాయ్‌లెట్‌లో పోయటం వలన అమ్మోనియా ఉద్గారాలు 56 శాతం తగ్గుతాయి. జంతు ఆవాపంలో మూత్ర స్థాయిలను తగ్గించడం వల్ల వాటి పరిశుభ్రత, సంక్షేమం మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా మూగజీవాలతో అలా చేయించగలిగారు. కానీ అన్ని ఆవులకు అలా ట్రెయిన్ చేయటం కష్టమే కదా!!