డబ్బుల కోసం నిత్య పెళ్లిళ్లు చేసుకుంటూ.. భర్తల్ని దారుణంగా మోసం చేసిన కిలేడీల గురించి మనం ఇదివరకే విన్నాం. కానీ, ఇక్కడ చెప్పుకోబోయే ఓ లేడీ స్టోరీ మాత్రం అందరినీ షాక్‌కి గురి చేయడం ఖాయం. ఈమె కథలోని ట్విస్టులు చూస్తే, కచ్ఛితంగా విస్తుపోతారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. పదండి నేరుగా మేటర్‌లోకి వెళ్లిపోదాం.
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ.. కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. గొడవలేమీ లేదు. భర్త బాగా సంపాదించి, ఆమెకు విలాసవంతమైన జీవితమే ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు కూడా! అంతా బాగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో.. ఒక రోజు ఆ మహిళకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఆ నంబర్ ఎవరిదోనని ఆరా తీసేందుకు, తిరిగి కాల్ చేసింది. అలా ఆ అజ్ఞాత వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. పలుసార్లు వీళ్లు కలుసుకున్నారు కూడా! ఈ క్రమంలోనే ఆమె ఆ వ్యక్తితో ప్రేమలో పడింది. ఇంకేముంది, పక్కా ప్లాన్ వేసుకొని అతనితో పారిపోయింది.
నాగ్‌పూర్‌కి పారిపోయిన ఆ జంట.. నగర శివారులోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకొని, అక్కడే కాపురం పెట్టింది. రెండేళ్ల పాటు వీరి దాంపత్య జీవితం కూడా సంతోషంగానే గడిచింది. అప్పుడు ఆ మహిళ మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటోన్న ఆమెకు, ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి, మూడో వ్యక్తితో లేచిపోయింది. భార్య నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో, పుట్టింటికి ఫోన్ చేశాడు. అక్కిడికి రాలేదని వాళ్లు చెప్పడంతో.. అప్పుడు భర్తకు తన భార్య పారిపోయిందన్న జ్ఞానోదయం కలిగింది.
కోపంతో రగిలిపోయిన ఆ భర్త, ఓ ప్లాన్ చేశాడు. శతృవుకి శతృవు మిత్రుడు అవుతాడన్న సామెతని నిజం చెప్పాడు. ఆ మహిళ మొదటి భర్తతో చేతులు కలిపాడు. తమని దారుణంగా మోసం చేసిన తమ భార్య పని పట్టాలని నిర్ణయించుకొని, పోలీస్ కేసు పెట్టారు. పాపం.. వీరి వ్యధ విని చలించిపోయిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మూడో వ్యక్తితో పరారైన ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.