ఈమధ్య కాలంలో మనం పెళ్లిళ్లలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవడాన్ని తరచూ చూస్తూనే ఉన్నాం. వాటిల్లో కొన్ని సీరియస్‌గా ఉంటే, మరికొన్ని నవ్వులు తెప్పించే విధంగా ఫన్నీగా ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఒకటి రెండో కేటగిరీకి చెందింది. ఒక్క మిఠాయి, కేవలం ఒకే ఒక్క మిఠాయి వధూవరుల మధ్య చిచ్చు పెట్టేసింది. దీంతో, అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేదికపై ఉన్న వధూవరులు.. ఒకరినొకరు పొల్లు పొల్లుమని కొట్టేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
పెళ్లి తంతు దాదాపు ముగిసిపోయింది. వధూవరులు పూలజమాలలు మార్చేసుకున్నారు. ఇక పెళ్లి అయిపోయింది కాబట్టి, వధూవరుల నోరు తీపి చేసేందుకు ఒకరు మిఠాయిలు తీసుకొని వేదిక మీదకి వచ్చారు. తొలుత వరుడికి తినిపించమని వధవు చేతికి స్వీట్ ఇచ్చారు. అయితే.. ఆమె ప్రేమతో కాకుండా బలవంతంగా తినిపించింది. ఆమె తన చేతిని దూరంగా జరుపుతుండగా, అతడు ఆ స్వీట్ తినేందుకు ముందుకొస్తూ ఉన్నాడు. ఇంతలో ఆమె ‘తినరా కుంభకర్ణుడా’ అన్నట్టు ఆ స్వీట్‌ని నోట్లో కుక్కింది. దీంతో కోపాద్రిక్తుడైన ఆ వరుడు.. ‘నువ్వేనా ఇలా చేసేది, నేనూ చేస్తా చూడు’ అన్నట్టు స్వీట్ తీసుకొని వెంటనే వధువు నోట్లో బలవంతంగా కుక్కేశాడు. మొదట ఆమె తిననని మారాం చేసింది. కానీ, ఇతగాడు మాత్రం దగ్గరకు లాక్కొని మరీ స్వీట్ తినిపించాడు.
ఇంకేముంది.. ఆ వధువుకి కోపం నషాళానికి ఎక్కేసింది. ‘రాక్షసుడిలాగే అలా కుక్కావేంటి’ అన్నట్టుగా కోపంగా వరుడ్ని చూస్తూ.. లాగి ఒక్కటి కొట్టింది. నిండు వేడుకలో వేదికపైనే తన మీద చెయ్యి చేసుకుంటే ఆ వరుడు ఊరికే ఉంటాడా? తను కూడా తిరిగి ఒక్కటిచ్చాడు. అయితే, అతడు కొట్టే దృశ్యం మాత్రం వీడియోలో రికార్డ్ అవ్వలేదు. చూస్తుంటే, ఇంతలో పెద్దలు కలగజేసుకొని ఆ గొడవని అక్కడితో ఆపేసినట్టే తెలుస్తోంది. ఏదేమైనా.. స్వీట్ కోసం వధూవరులు కొట్టుకున్న ఈ వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. మీరూ చూసి నవ్వుకోండి.