ఖగోళ ప్రియులకు ఈనెల 24న ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. నవగ్రహాలలోని ఐదు గ్రహాలు ఒకే వరుసలో కన్పించనున్నాయి. ఆయా గ్రహాలు వాటి కక్ష్యల్లోనే తిరుగుతున్నప్పటికీ ఒకే వరుసలో ఉన్నట్లు కన్పించడమే ఈ అద్భుతం అని ఖగోళ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ మేరకు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురు, శని గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కనిపించనున్నాయి. సాధారణంగా మూడు గ్రహాలు ఒకే వరుసలో వస్తూంటాయి. అలా జరగడాన్ని గ్రహాల సంయోగంగా పిలుస్తారు.
కానీ ఇలా ఐదు ప్రధాన గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కన్పించడం మాత్రం చాలా అరుదు. చివరిసారిగా 2004లో ఇలా ఐదు గ్రహాలు ఒకే సరళరేఖపై ఉన్నట్లు ఖగోళ ప్రియులకు కనిపించాయి. ఈనెల 24న ఒకే వరుసలో ఐదు గ్రహాలు కనిపించే అద్భుత దృశ్యాన్ని టెలిస్కోప్ అవసరం లేకుండానే నేరుగా చూడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ అరుదైన దృశ్యం చూడటానికి సూర్యోదయానికి ముందే మేల్కోవాలి. ఎందుకంటే సూర్యుడికి అతి దగ్గరగా బుధగ్రహం ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తే ఆ కాంతిముందు బుధగ్రహం కన్పించదు. అందువల్ల బుధగ్రహంతోపాటు ఐదు గ్రహాలను చూడాలంటే సూర్యోదయానికి ముందే తూర్పువైపున, ఎత్తయిన ప్రాంతంపై నిలబడి చూడాలని ఖగోళ సైంటిస్టులు సూచిస్తున్నారు.