అసోంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు స్కూటర్ కొనుగోలు చేసేందుకు తాను తాచుకున్న డబ్బంతా బైక్ షోరూంకు బస్తాలో తీసుకెళ్లాడు. అయితే ఆ నగదు అంతా చిల్లర నాణేలు కావడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. హిరాక్ జె దాస్ అనే చిల్లర వ్యాపారి కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నెలలు తరబడి చిల్లర నాణేలను పొదుపు చేశాడు. ఇలా ఎనిమిది నెలల పాటు పోగుచేసిన నాణేలను ఒక బస్తాలో వేసి భద్రపరుచుకున్నాడు.
అయితే దాస్ అనుకున్న రోజు రానే వచ్చింది. దీంతో చిల్లర నాణేలు దాచుకున్న బస్తాతో షోరూంకు వెళ్లాడు. దీంతో అక్కడ షోరూం వాళ్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. నెమ్మదిగా షాక్ నుంచి తేరుకుని చిల్లర నాణేలను లెక్కించారు. సదరు నాణేలను ఒక ప్లాస్టిక్ బుట్టల్లో వేసుకుని మరీ లెక్కించారు. ఆ తర్వాత దాస్ తనకు నచ్చిన స్కూటర్‌ని కొనుకున్నాడు. అతడు స్కూటర్‌ను మొత్తం చిల్లర నాణేలతోనే కొనుగోలు చేయడం విశేషం. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది.