ఏ దేశంలో అయినా వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే పెళ్లితోనే ఒక కుటుంబం ఏర్పడుతుంది. కొన్ని ఫ్యామిలీస్ కలిస్తేనే ఒక సమాజం అవుతుంది. కాబట్టి సమాజానికి మొదటి మెట్టయిన వివాహానికి నమ్మకమే పునాది. అందుకే భార్యా భర్తలు ఒకరికి ఒకరు సొంతం అని బావిస్తారు. తమ మధ్యన మూడో వ్యక్తిని ఊహించుకోలేరు. వివాహేతర సంబంధాన్ని అస్సలు జీర్ణించుకోలేరు. అయినా నిత్యం ఎన్నో వివాహేతర సంబంధాలు వెలుగు చూస్తున్నాయి. వాటి కారణంగానే ప్రతి రోజు అనేక నేరాలు ..ఘోరాలు జరగటం మనం చూస్తున్నాం. వివాహేతర సంబంధం ఒక పురుషుడు, ఒక స్త్రీకి సంబంధించినది. ఇద్దరూ ఇష్టపడి సాగించే చాటు మాటు వ్యవహారం. ఇది పూర్తిగా కోరికకు సంబంధించినది. ఈ అనైతిక బంధాన్ని అల్లుకుని నేరం..చట్టం ..శిక్ష ఉంటాయి. అయితే ఇప్పుడు వివాహేతర సంబంధాలకు సంబంధించి ఆలోచనా ధోరణిలో మార్పు కనిపిస్తోంది.
భార్య గాక మరో మహిళతో సంబంధం పెట్టుకున్న పురుషుణ్ని శిక్షించే చట్టాన్ని సుప్రీం కోర్టు చాలా ఏళ్ల క్రితమే సమీక్షించింది. పురుషుణ్ని మాత్రమే శిక్షించే వ్యభిచార నేర చట్టం మారాల్సిన అవసరం లేదా.. అంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఎందుకంటే, వివాహేతర సంబంధంలో స్త్రీ పురుషులిద్దరికీ సమానమైన పాత్ర ఉంటుంది. ఈ నేపథ్యంలో, వివాహితులు ఇష్టపూర్వకంగా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే నేరం కాదని ఇటీవల తీర్పు చెప్పింది. భార్యను భర్త ఆస్తిగా భావించడమనేది కాలం చెల్లిన భావనని స్పష్టం చేసింది. దాంతో ఇప్పుడు వివాహేతర సంబంధం అనేది కేవలం నైతికతకు సంబంధించిన అంశంగా మారిపోయింది.
ఇదిలావుంటే, కాలానుగుణంగా అక్రమ సంబంధాల తీరు కూడా మారింది. ప్రస్తుతం మనం ఉన్న డిజిటల్ యుగం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. గతంలో భారతదేశంలో పెళ్లికి ముందు అమ్మాయిలు, అబ్బాయిలు అసలు కలుసుకునేవారు కాదు. ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి కనిపిస్తే ఆశ్చర్యంగా చూసేవారు. కానీ ఇంటర్నెట్..స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు సులభంగా వారిని కనెక్ట్ చేస్తున్నాయి. మునపటిలా ప్రేమ లేఖలు .. మధ్యవర్తుల అవసరం లేకుండా పోయింది. ఒక్క మెసేజ్ చాలు. ఇలాంటి అనుబంధాలను కోరుకునేవారి కోసం ప్రత్యేకంగా డేటింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా పెళ్లికి ముందే వ్యవహారం సాగిస్తున్నారు. ఇది చాలదని ఇప్పుడు ఏకంగా ఎక్స్‌ట్రామ్యారిటల్ డేటింగ్ యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. అందులో చేరి స్వేచ్చగా అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ సర్కిల్స్లో ‘గ్లీడెన్’ పేరుతో అలాంటి ఓ యాప్ హల్‌చల్ చేస్తోంది. ఇది ఫ్రాన్స్ లో రూపొందిన యాప్. ప్రపంచవ్యాప్తంగా దీనికి కోటి మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వారిలో 20 శాంత మంది ఇండియా నుంచి ఉన్నారు. అంటే 20 లక్షల మంది గ్లీడెన్ క్లయింట్లుగా ఉన్నారంటే మనవాళ్లు వైవాహిక సంబంధాల కోసం ఎంతలా పెంపర్లాడుతున్నారో అర్థమవుతోంది.
Read Also: Wrestlers Protest: ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉషకు రెజ్లర్ల లేఖ.. డిమాండ్లు ఇవే..!!
కంపెనీ గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 2022 నుండి ఈ సంఖ్య 11 శాతం పెరిగింది. కొత్త సబ్‌స్క్రైబర్‌లలో 66 శాతం మంది టైర్ 1 నగరాల నుండి వచ్చారు. మిగతా 44 శాతం టైర్ 2, టైర్ 3 నగరాల నుండి వస్తున్నారని కంపెనీ తెలిపింది. గ్లీడెన్‌లోని భారతీయ వినియోగదారులలో ఎక్కువ మంది ఉన్నత సామాజిక, ఆర్థిక నేపథ్యం నుండి వచ్చినవారేనని పేర్కొంది. ఇక ఇందులో చేరిన స్త్రీ పురుషులలో ఇంజనీర్లు, కంపెనీ వ్యవస్థాపకులు, కన్సల్టెంట్లు , మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, డాక్టర్లు వంటి వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నారు. ఇందులో గృహిణులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉండటం విశేషం.
వయస్సు విషయానికొస్తే, పురుషులు ఎక్కువగా థర్టీ ప్లస్, ఆడవాళ్లు 26 ప్లస్ ఏజ్ గ్రూప్‌కు చెందినవారు. మహిళలకు మరింత సురక్షితంగా ఉండేలా ఈ యాప్ రూపొందించారని నిర్వాహకులు అంటున్నారు. అందుకే 2023లో ఈ యాప్ యూజర్లలో 60 శాతం మంది పురుషులు ఉండగా.. 40 శాతం మంది మహిళలు ఉన్నారు.భారతదేశంలో వివాహం, ఏకపత్నీవ్రతం,ఏకభార్యత్వం విలువైనదిగా పరిగణించినా.. వివాహేతర డేటింగ్ యాప్ గ్లీడెన్‌లో వినియోగదారుల సంఖ్య 18 శాతం పెరిగింది. డిసెంబర్ 2021లో 1.7 మిలియన్ల యూజర్లు ఉంటే 2022లో వారి సంఖ్య 2 మిలియన్లకు పెరిగిందని ఇండియా కంట్రీ మేనేజర్ సిబిల్ షిడెల్ గ్లీడెన్ తెలిపారు. వివాహితుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినందున గ్లీడెన్ యాప్‌లో భారతీయ వినియోగదారుల పెరుగుదల… దేశంలో ఏకస్వామ్యం యొక్క సాంప్రదాయ భావనలు ఎలా క్రమంగా మారుతున్నాయో ప్రతిబింబిస్తుందని కంపెనీ అంటోంది.
ఫ్రాన్స్‌కు చెందిన అన్నదమ్ములు 2009లో ‘గ్లీడెన్’ను ప్రారంభించారు. 20 మంది సభ్యులతో కూడిన మహిళా బృందం దీన్ని నిర్వహిస్తోంది. 2017లో భారత్‌లో దీనిని ప్రారంభించారు. ఐదేళ్లలో 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పొ పొందగలిగింది. మొదట్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాల నుంచే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు వచ్చేవారు. ఇప్పుడు చిన్న చిన్న నగరాలు..పట్టణాల నుంచి కూడా యాప్‌లోకి వెళుతున్నారు. కాగా భారతీయులు యూరోపియన్ల కంటే కొంచెం ఎక్కువసేపు చాట్‌లో ఉంటున్నారని తేలింది.
రోజుకు సగటున 3.5 గంటలు యాప్‌లోనే గడుపుతున్నారు. వీకెండ్‌లో మరింత ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ యాప్ ప్రస్తుతం 159 దేశాల్లో సేవలందిస్తోంది. ఈ యాప్ మహిళలకు పూర్తిగా ఉచితం. కానీ పురుషులు మాత్రం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే తమతో నిజంగా మహిళనే చాట్ చేస్తోందా లేదా పురుషుడే పేరు మార్చుకుని చాట్ చేస్తున్నాడా అనేది మోడరేషన్ బృందం సాయంతో చెక్ చేసుకోవచ్చు. గ్లీడెన్‌లో నమోదు చేసుకోవడం సులభమే కానీ ఐడెంటిఫైయర్‌గా మారు పేరు పెట్టుకోవాలి. ప్రొఫైల్ చిత్రం తప్పనిసరి కాదు. వ్యభిచారం నేరం కాదని 2018లో కోర్టు తీర్పు చెప్పిన తరువాత భారత్‌లో ఈ యాప్ కి గిరాకీ పెరగడం గమనార్హం. సమాజం ఎటుపోతోందని కొందరు సంప్రదాయవాదులు పెదవి విరుస్తున్నారు.
-డా.భువనగిరి రమేష్ బాబు
Read Also: Minister Errabelli : దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారు