Driving Without Sufficient Fuel ..Traffic Challan From Kerala Goes Viral:
ఇప్పటివరకు హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేయడం చూశాం.. డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఫైన్ వేయడం చూశాం.. కానీ బండిలో పెట్రోల్ లేదని ఫైన్ వేయడం ఎప్పుడైనా చూశామా?. ట్రాఫిక్ నిబంధనల పేరుతో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఎడాపెడా ఛలానాలు వేసేస్తున్నారని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని పుక్కల్లు ప్రాంతానికి చెందిన బసిల్ శ్యామ్ అనే యువకుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైకుపై వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండిలో పెట్రోల్ తక్కువగా ఉందని రూ.250 జరిమానా విధించారు. ఈ ఛలానాను కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.
Read Also: lions Rates: పాకిస్తాన్ లో గేదెల కన్నా చీప్ గా సింహాల ధరలు.. ఎందుకంటే..
అయితే శ్యామ్ అనే యువకుడు ఈ ఛలాన్‌పై మాట్లాడుతూ.. తాను ఆఫీసుకు వెళ్లే సమయంలో పోలీసులు ఆపారని.. వన్‌వేలో అపోజిట్‌గా వెళ్తున్నానని ట్రాఫిక్ పోలీస్ ఆపి రూ.250 జరిమానా కట్టాలని చెప్పారని.. అయితే తాను ఆఫీస్‌కు త్వరగా వెళ్లాలనే తొందరలో ఛలాన్‌ను గమనించలేదని.. ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత రశీదును గమనిస్తే ఎందుకు జరిమానా పడిందనే విషయం తెలిసిందని పేర్కొన్నాడు. ఇదే విషయంపై ముగ్గురు లాయర్లను అడగ్గా.. వాహనంలో ఫ్యూయల్‌కు సంబంధించి ఎలాంటి జరిమానా లేదని చెప్పారని.. కేరళ ట్రాన్స్‌పోర్ట్ చట్టాల ప్రకారం చూస్తే కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఫ్యూయల్ సంబంధిత జరిమానాలు విధించేందుకు అధికారం ఉంటుందని చెప్పారని వివరించారు. కమర్షియల్ వాహనాలు ప్యాసింజర్లను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టారన్నారు. అయితే వ్యక్తిగత వాహనాలకు ఇలాంటి నిబంధన లేదని.. కానీ తనకు వాహనంలో పెట్రోల్ లేదని జరిమానా విధించడం వింతగా ఉందన్నారు. కాగా పోలీస్ టైపింగ్ వల్లే ఇలా జరిగి ఉంటుందని బాధితుడు శ్యామ్ అభిప్రాయపడ్డాడు.
