ఈమధ్య వింత వింత కారణాల వల్ల పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. బట్టతల ఉందనో, తాగుడు అలవాటు ఉందనో.. అమ్మాయిలు పీటల మీదే పెళ్లిళ్లను రద్దు చేసేసుకుంటున్నారు. అంతెందుకు.. మొన్నటికి మొన్న పూలమాల వేస్తున్నప్పుడు వరుడి చెయ్యి తన మెడకు తగిలిందన్న కారణంగా వధువు అప్పటికప్పుడే పెళ్లి రద్దు చేసుకొని, మండపం నుంచి బయటకు వెళ్లిపోయింది. తాజాగా ఓ వధువు కేవలం ఫోటోగ్రాఫర్ రాలేదన్న ఆగ్రహంతో.. పెళ్లి క్యాన్సిల్ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కాన్పూర్ దేహత్ జిల్లాకు చెందిన ఓ అమ్మాయికి.. అదే జిల్లాలోని భోగ్నిపూర్‌కు చెందిన ఒక అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగిపోవడమే కాదు.. పెళ్లికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పెళ్లి వేడుక కూడా మొదలైంది. బారాత్‌తో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన అబ్బాయి, వేదిక ఎక్కాడు. ఇక మూల మాల వేయడమే తరువాయి. ఇటువంటి క్షణాలు ఎంతో మధురవైనవి. వీటిని చరకాలం గుర్తుండిపోయేలా ఫోటోల్లో బంధించుకోవాలని ఎవ్వరైనా కోరుకుంటున్నారు. ఆ వధువు కూడా అదే కోరింది. కానీ, అక్కడ ఫోటోగ్రాఫర్ లేడు. ఈ విషయాన్ని గుర్తించిన వధువు.. మరో క్షణం ఆలోచించకుండా వేదిక దిగి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత నచ్చజెప్పినా వినలేదు.
‘‘అరె ఫోటోగ్రాఫర్ లేనంత మాత్రాన పెళ్లి రద్దు చేసుకుంటారా?’’ అడిగితే.. ‘‘పెళ్లి వేడుకనే సరిగ్గా పట్టించుకోనివాడు.. రేపు పెళ్లయ్యాక తనను బాగా చూసుకుంటాడన్న నమ్మకమేంటి’’ అని వధువు గట్టిగా వాదించింది. దీంతో, చేసేదేమీ లేక పెళ్లి రద్దు చేశారు. ఇచ్చిపుచ్చుకున్నవన్నీ తిరిగిచ్చేసి, ఇరు కుటుంబాలు పెళ్లి వేదిక నుంచి ఇంటి దారి పట్టాయి. చివర్లో వెలుగుచూసిన ట్విస్ట్ ఏంటంటే.. అబ్బాయి తరఫు వాళ్ళు ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌ని ముందే మాట్లాడి పెట్టారు. కానీ, వారి మధ్య విబేధాలు తలెత్తడంతో పెళ్లికి రాలేదు. పాపం వరుడు.. వారి మధ్య ఉండే గొడవలు అతని ఆశలపై నీళ్లు చల్లేశాయి.