ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీలో ఓ ముస్లిం కుటుంబానికి చెందిన శుభలేక చర్చనీయాంశమైంది. కార్డు ప్రసిద్ధి చెందడానికి కారణం దానిపై ముద్రించిన చిత్రం. ఆ చిత్రాన్ని చూస్తున్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. యూపీలోని అమేథీలో ముస్లిం కుటుంబానికి చెందిన ఓ కుమార్తె పెళ్లి కార్డుపై హిందూ దేవుళ్లు, దేవత ఫొటోలు ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది.
గణేశుడితో రాధా-కృష్ణుల చిత్రాలు..
సింగ్‌పూర్ బ్లాక్ అల్లాదిన్ గ్రామానికి చెందిన షబ్బీర్ టైగర్ కుమార్తె సైమా బానో వివాహం నవంబర్ 8న జరగనుంది. ఈ పెళ్లి కార్డులో హిందూ దేవుళ్లు చిత్రాలను ముద్రించడంతో ఆ ప్రాంతంలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గణేశుడి చిత్రపటంపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కార్డులో గణేశుడితో పాటు కృష్ణుడు, రాధ చిత్రాలు ఉన్నాయి.
కూతురు తండ్రి షబ్బీర్ ఏమన్నాడు?
రాయ్‌బరేలీ జిల్లా మహరాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సేన్‌పూర్ గ్రామానికి చెందిన ఇర్ఫాన్‌తో వివాహం జరిగింది. సమాజానికి సానుకూల సందేశం అందేలా, సోదర భావాన్ని పెంపొందించేందుకు వీలుగా కార్డులపై హిందూ దేవుళ్ల చిత్రాలను ముద్రించినట్లు షబ్బీర్ చెబుతున్నారు. ఈ చర్య హిందూ-ముస్లిం ఐక్యతను బలోపేతం చేస్తుందని, ప్రజలు ఒకరి మత విశ్వాసాలను గౌరవిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంపై సభ్యసమాజం ఏమంటారని షబ్బీర్‌ను ప్రశ్నించగా.. తనకు పట్టింపు లేదని సమాధానమిచ్చారు. సమాజంలో సమిష్టి సామరస్యాన్ని పెంపొందించడం, మంచి సందేశం ఇవ్వడం మాత్రమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఈ సందేశాన్ని విన్న ప్రజలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.